Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు, హిమాయత్‌సాగర్ 6 గేట్ల ద్వారా నీటి విడుదల
- మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరదనీరు చేరుతుండటంతో నిండుకుండల్లా మారాయి. ఉస్మాన్‌సాగర్(గండిపేట) రిజర్వాయర్‌కు వరద నీరు చేరుతుండటంతో 8 గేట్లను 6 ఫీట్ల మేరకు ఎత్తి 4658 క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం 4300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో ఉంది. 6 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 3910 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 3500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. దాంతో ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాత బ్రిడ్జి కావడంతో రాకపోకలు నిలిపివేశారు.
మంగళ, బుధవారాల్లో బ్రిడ్జిపైకి నీరు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మూసీ వరద ప్రభావం అధికమైతే చాదర్‌ఘాట్‌లో లెవెల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిపేస్తామని జీహెచ్ఎంసీ మలక్‌పేట డిప్యూటీ కమిషనర్ జయంత్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111కు కాల్ చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ 24 గంటలపాటు పనిచేస్తుందన్నారు.