Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'సీఎం కేసీఆర్ దగ్గర నా ప్రశ్నలకు సమాధానాల్లేవ్. ధైర్యం లేకనే అయన బానిసలతో తిట్టిస్తున్నాడు' అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్‌ను ఓడించకపోతే తన జన్మ వృథా అయినట్టేనన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఓటమి ఖాయమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందనీ, బీఆర్ఎస్ పెట్టినా గట్టెక్కలేరని స్పష్టంచేశారు. తాను రాజకీయంగా ఇప్పటి వరకూ ఓడిపోలేదన్నారు. 2018 ఎన్నికల కంటే ముందు ఈడీతో పాటు అన్ని సంస్థలతో దాడులు చేపించినా తన దగ్గర ఏమీ దొరకలేదన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే ధైర్యం లేక వీఆర్వోలను తీసేశారనీ, వాళ్ల ఉసురు కేసీఆర్‌కు తప్పకుండా తగులుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, ఈటల, హరీష్ రావుల పాత్ర ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసనన్నారు. తన మంత్రి పదవి పీకేసి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలని మంత్రి గంగులతో ప్రెస్‌మీట్ పెట్టించి మరీ రెచ్చ గొట్టారన్నారు. తన ప్రతిష్టని ఓర్వలేక చిల్లర ఆరోపణలు చేసి తనను బయటకి పంపించారని విమర్శించారు. కేసీఆర్ బొమ్మపై గెలిచావనీ, దమ్ముంటే రాజీనామా చేయాలని చెబితే రాజీనామా చేసి గెలిచానని అన్నారు. తిమ్మినిబమ్మిని చేసి హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు గెలిచినోళ్లం హుజూరాబాద్‌లో గెలువకుండా పోతమా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టీఆర్ఎస్ ముందుకు వెళ్లిందన్నారు.