Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పేదలకు ఉచిత వైద్యం అందిస్తామన్న ఒప్పందంతోనే అపోలో, బసవతరాకం ఆస్పత్రులకు వరసగా 1981లో 30 ఎకరాలు, 1989లో ఏడుకుపైగా ఎకరాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అపోలోకు ఎకరం రూ.8500, బసవతారకానికి ఏడాదికి రూ.50 వేలు లీజు ప్రాతిపదికపై ఇచ్చినట్టు పేర్కొంది. అప్పట్లో ప్రభుత్వానికి, ఆస్పత్రులకు మధ్య ఎంవోయూ జరిగిందని, అనాటి జీవోల అమలు జరిగేలా ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసినట్లు తెలిపింది. దీని ప్రకారం ఆరోగ్యశ్రీ స్కీంలో అపోలో 15 శాతం, బసవతారకంలో 25 శాతం చొప్పున బెడ్లు కేటాయించాలనీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ఇచ్చే రేషన్ కార్డులు ఉన్న పేదలకు బసవతారకం ఆస్పత్రిలో 40 శాతం ఔట్ పేషెంట్ వైద్యం ఉచితంగా అందించాల్సి ఉందని స్పష్టం చేసింది. గత జీవోల ప్రకారం పేదలకు వైద్య అందజేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిల్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌భూయాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. పూర్వపు ఎంఓయూల ప్రకారం రెండు హాస్పటళ్లు పేదలకు ఉచితంగా బెడ్లు ఇవ్వకపోయినా, బసవతారకంలో ఉచితంగా ఓపీలు చూడకపోయినా జరిమానా విధింపు, ఆర్ఆర్ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ యాక్షన్ తీసుకునే అధికారాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. ఈ వివరాలను పరిశీలించిన హైకోర్టు విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
ఓయూ భూకబ్జాపై
ఓయూ భూముల్లో ఎనిమిది వేల గజాలు కబ్జా అయ్యిందన్న పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి బెంచ్ విచారించింది. రమణరావు వేసిన పిల్లో ప్రభుత్వం వాదిస్తూ, సుమారు నాలుగు వేల గజాలు కబ్జా జరిగిందనీ, దీనిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పింది. ఈ కేసులో చార్జిషీటు వేయాలనీ, మేజిస్ట్రేట్ వద్ద సాక్షుల వాదనల నమోదు అయ్యాయని తెలిపింది. దీంతో విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది.