Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాకు వెల్లడించిన గొంగిడి మనోహర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ఆగస్టు రెండో తేదీ నుంచి ఆ నెల 26 వరకు తలపెట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర చారిత్రక ప్రదేశాల మీదుగా సాగునున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, యాత్ర ప్రముఖ్ డాక్టర్ గొంగిడి మనోహర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, యాత్ర సహప్రముఖ్లు తూళ్ల వీరేందర్‌గౌడ్, శంకర్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆగస్టు ఏడో తేదీన ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా యాత్ర పోచంపల్లికి చేరుకోనున్నదనీ, అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. యాదాద్రిలో యాత్ర ప్రారంభమై పోచంపల్లి, గుండ్రాంపల్లి, శ్రీకాంతాచారి స్వగ్రామమైన పొడిచేడు, రజకార్లను ఎదురొడ్డి పోరాడిన కడవెండి, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన పలు ప్రాంతాల మీదు యాత్ర సాగనున్నదని తెలిపారు.తొలి రెండు ప్రజాసంగ్రామ యాత్రలకు మంచి స్పందన వచ్చిందన్నారు. మూడో విడత యాత్ర కూడా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.