Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నదని, అందులో భాగంగా కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలి... దేశం మొత్తం తన చెప్పుచెత్తల్లో ఉంచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోం దన్నారు. దేశ రాజ్యాంగాన్ని, లౌకిక పునాదులను ధ్వంసం చేస్తున్న కాషాయ పార్టీని అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో లౌకికవాద పార్టీలు ఏకం కావా ల్సిన అవసరం ఏర్పడింద న్నారు. హైదరాబాద్ లోని మఖ్దూం భవన్లో బి.జయసారధి అధ్యక్షతన మంగళవారం సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాన్ని నిర్వహించారు. నారాయణతోపాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం, నల్లధనం, డ్రగ్స్ తదితరాలను అంతమొందిస్తామంటూ మోడీ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఇది జరిగి ఎనిమిదేండ్లయినా ఎక్కడా ఉగ్రవాదం సమసిపోలేదని, దేశంలో నల్ల ధనం రెట్టింపు అయ్యిందని, డ్రగ్స్ అయితే విచ్చల విడిగా స్మగ్లింగ్ అవుతోందని విమర్శించారు. ఆప్ఘని స్తాన్ నుంచి గుజరాత్ ముంద్రాపోర్టుకు, అక్కడి నుంచి దేశ మొత్తానికి డ్రగ్స్ సరఫర జరుగుతున్న దన్నారు. స్వతంత్ర వ్యవస్థలైన ఆర్బీఐ, సీబీఐ, ఎన్నికల కమిషన్‌ను కేంద్ర సర్కార్ నాశనం చేసింద న్నారు. గతంలో సీబీఐ శక్తివంతంగా ఉండేదని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రాజాను, ఎంపి కనిమోళిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. విజరు మాల్యా మినహా బ్యాంకులను ముంచినవాళ్లంతా గుజరాత్ చెందిన వారేనని అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాల ఉండాలని ప్రధాని మోడీ చెప్పుతు న్నారనీ.. అసలు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోనే మొన్నమొన్నటి వరకు జాతీయ జెండా ఎగురవేయ లేదని ఎద్దేవా చేశారు. అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు చట్టాలను మారుస్తు న్నారని అన్నారు. పోడు భూములకు సంబంధించి న్యాయం చేస్తామని ప్రకటించిన సిఎం కెసిఆర్ మాట నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు. ఈ సమస్య పరిష్కారం కోసం కలిసివచ్చే పార్టీలతో పోరాటాలు నిర్వహించాలని నారాయణ పేర్కొన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చాడ మాట్లాడుతూ... విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయని బీజేపీ రాష్ట్రంలోకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నదని వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారానే అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఆదిలా బాద్ సిమెంట్, విశాఖ ఉక్కు లాంటి కంపెనీలను కేంద్రం అమ్మకానికి పెటిందని గుర్తు చేశారు.
తమిళిసైని రీ కాల్ చేయాలి : నారాయణ
రాష్ట్ర గవర్నర్‌ను తమిళిసై సౌందరరాజన్‌ను వెంటనే రీ-కాల్ చేయాలని నారాయణ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఆమె తన పరిధికి మించి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. గవర్నర్ పదవి అనేది రాజకీయాలకు సంబంధం లేనిదని పేర్కొన్నారు. అయితే ఆ విషయాన్ని పక్కనపెట్టిన గవర్నర్ రాజకీయ నేత తరహాలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 'తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాలేరు, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు పోలేరు, అసెంబ్లీని కూడా రద్దు చేయడం సాధ్యం కాదు...' అంటూ తమిళిసై తన పరిధిలోకి రాకూడని రాజకీయపరమైన అంశాలను మాట్లాడడాన్ని నారాయణ తప్పుబట్టారు.