Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ కిట్ దేశానికే ఆదర్శం
- ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో తనిఖీ
నవతెలంగాణ-నల్లగొండ
గర్భిణుల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే రావాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ వార్డు, పిల్లల వార్డు, కరోనా టెస్టుల కేంద్రాన్ని సందర్శించారు. గర్భిణులతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. వైద్య సేవలు, పరీక్షలు, అమ్మ ఒడి వాహన సేవలు, కేసీఆర్ కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగాయని తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ ఆస్పత్రులకే రావాలని సూచించారు. మగ బిడ్డ పుడితే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే రూ.13వేలు అందించడంతోపాటు 16 వస్తువులతో కూడిన కిట్ ఇస్తున్నట్టు చెప్పారు. ఆటో కిరాయి ఖర్చు లేకుండా గర్భిణులను అమ్మ ఒడి సేవల ద్వారా ఇండ్లకు చేరుస్తున్నామన్నారు. కరోనా పరీక్షాకేంద్రం వద్ద మంత్రి పరిశీలించారు. పరీక్షలు, హోమ్ ఐసోలేషన్ కిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కిట్‌లో ఉన్న మందులను వాడుతూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ, ప్రమాదకర పరిస్థితులకు వెళ్లే అవకాశం చాలా తక్కువ ఉందన్నారు. మెడికల్ కాలేజీలో సమస్యలపై విద్యార్థులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి వెంట కలెక్టర్ రాహుల్‌శర్మ, నల్లగొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్, మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నిత్యానందం ఉన్నారు. అంతకుముందు మంత్రి జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.