Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిలపక్ష నేతల డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
'కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి బాధ్యులైన మెఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవితవ్యంపై ఇంజినీరింగ్ నిపుణులు, తెలంగాణ మేధావులతో లోతైన సమీక్ష చేపట్టాలి' అని రాజకీయ పార్టీలు, ఆయా సంస్థలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ఆ మేరకు తీర్మానాలను సైతం ఆమోదించాయి. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్) అధ్యక్షులు పల్లె రవికుమార్ అధ్యక్షతన తెలంగాణ ఇంజినీర్ల ఫోరం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సంయుక్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్.. ప్రజోపయోగమా? రూ.లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగమా? వాస్తవాలు - వక్రీకరణలు' అనే అంశంపై సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం అధ్యక్షులు దొంతుల లక్ష్మినారాయణ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పాలన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి చాలా గ్రామాలు ముంపునకు గురికావటం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్మాణమే కారణమని దుయ్యబట్టరు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ 'రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ ఎనిమిదేండ్లల్లో సాధించింది ప్రశ్నించే గొంతులను నొక్కేయడమేనని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ నేత ఇందిరా శోభన్ మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతికి బీజేపీ కూడా కారణమేనని విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్‌తో పాటు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు కూడా దోచుకుంటున్నారనీ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగెస్ నేత అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, పాలమూరు అధ్యన వేదిక నాయకులు రాఘవాచారి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేత ఏపూరు సోమన్న, సీనియర్ జర్నలిస్టులు జయసారధి, మేకల కృష్ణ, బీజేపీ నాయకులు వన్నాల శ్రీరాములు, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు తదితరులు పాల్గొన్నారు.