Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన కబ్జా భూములను పేదలకు పంచుతాం
- మంత్రిగా అవినీతికి పాల్పడ్డాడు : బాల్కసుమన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విశ్వాస ఘాతకుడని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. 2004కు ముందు ఈటల అడ్రస్ ఎక్కడ..?రాజకీయంగా ప్రోత్సహించి మంత్రిని చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లో అసెంబ్లీ ఆవరణంలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, నోముల భగత్, కేపీ వివేకానంద, ఎమ్ఎస్ ప్రభాకర్‌రావు, జె.సురేందర్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీ విఠల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల శిఖండి రాజకీయాలను చూసి జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ అవినీతికి, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈటల కబ్జా చేసి ఎస్సీ, బీసీల భూములను పేదలకు పంచుతామని ప్రకటించారు. హుజారాబాద్‌లో ఈటల రాజేందర్ బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఆయన ఓటమి ఖాయమనీ, అందుకే కేసీఆర్‌పై పోటీ చేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు అయి ఉండి కమ్యూనలిస్టుగా మారిన ఈటలది నేడు బీజేపీలో బానిస బతుకు అయిందన్నారు. అమిత్‌షాకు గులాంగిరీలా పనిచేస్తున్నాడని తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని సూచించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి గవర్నర్ ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ద్రోహుల కర్మాగారాలుగా మారాయని విమర్శించారు. వాళ్లకు రాజకీయాలు తప్ప ప్రజల ఘోష పట్టడం లేదన్నారు. బీజేపీ అవినీతిపరులకు, నేరస్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. మంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పదిగా పేర్కొన్న ఈటల నేడు దానిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ఈటలది వ్యాపార నైజమనీ, ఆయనకు ఏ సిద్ధాంతమూ లేదని విమర్శించారు. గజ దొంగల పార్టీలో చేరి నీతులు వల్లిస్తున్నారన్నారు. మోడీ వచ్చి తెలంగాణలో రెండు నెలలు అడ్డా పెట్టినా ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో చేరరనీ, అసలు తెలంగాణలో ఆ పార్టీకి ఎదిగే అవకాశమే లేదని కొట్టిపాడేశారు. దమ్ముంటే ఈటలకు టచ్‌లో ఉన్న వారి పేర్లను బయటపెట్టాలని సవాల్ విసిరారు. జాజుల సురేందర్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ కాదు.. ఆయన రాజేందర్ రెడ్డి అన్నారు. ఆయన తన ఆధార్‌కార్డులో రెడ్డిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆయన తల సిండా కుళ్లుబుద్ధులేనన్నారు. తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని ఈటెల కుట్ర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఎవరెవరికి ఫోన్లు చేసి బతిమి లాడుతున్నారనే సమాచారం తమ దగ్గర ఉందన్నారు.