Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రమబద్ధీకరణ మరింత ఆలస్యం
- సమగ్ర వివరాలతో మళ్లీ పంపండి
- ఇంటర్ విద్యా కమిషనర్‌కు విద్యాశాఖ కార్యదర్శి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశమున్నది. ఇందుకు సంబంధించి ఇంటర్ విద్యా కమిషనర్ పంపించిన జాబితా తప్పుల తడకగా ఉందన్న విమర్శలొచ్చాయి. కమిషనర్ తీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. చాలా మంది పేర్లు గల్లంతు అయినట్టు తెలిసింది. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జాబితాను సమగ్ర వివరాలతో మళ్లీ పంపించాలంటూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ అందజేసిన ప్రతిపాదనల్లో కొన్ని లోపాలను గుర్తించామని తెలిపారు. అందువల్ల కొన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి సమాచారంతో జాబితాను మళ్లీ పంపాలని కోరారు. ఒరిజినల్ జాబితాలోని ప్రతిపాదనలకు సంబంధించిన ప్రతి పేజీని ధ్రువీకరించాలనీ, ఇంటర్ విద్యా కమిషనర్ సంతకం చేయాలని ఆదేశించారు. 2014, జూన్ 2 కంటే ముందున్న జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మంజూరైన పోస్టులకు సంబంధించిన జీవోలను జతపరచాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులను రోస్టర్ పాయింట్ల ప్రకారం ఫిక్స్ చేసి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 2016, మార్చి 26న ప్రభుత్వం విడుదల చేసిన 16 జీవో ప్రకారం 2014, జూన్ 2 నాటికి ఎంత మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారో, కేటగిరీల వారీగా మంజూరైన పోస్టులతో సహా తెలియజేయాలని కోరారు. జీవో 16 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం అర్హులైన కాంట్రాక్ట్ అధ్యాపకుల చెక్‌లిస్ట్‌లను అందించాలని సూచించారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో అధ్యాపకుల పోస్టులు, మంజూరు వివరాలు, ఖాళీలు, పనిచేస్తున్న వారి వివరాలు పూర్తిగా ప్రత్యేక టేబుల్ రూపంలో పంపాలని ఆదేశించారు. కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్‌ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం కోసం కచ్చితమైన సిఫారసులను పంపించాలని కోరారు. మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వివరాల్లో తేడాలుంటే పంపాలని సూచించారు. రెగ్యులర్, దూరవిద్య ద్వారా చదివిన వారి ప్రత్యేక జాబితాను, 101 జీవో ప్రకారం అర్హతల సడలింపులతో పనిచేస్తున్న వారి ప్రత్యేక జాబితాను, పారామెడికల్ కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల జాబితాను పంపాలని కోరారు. ప్రభుత్వం ద్వారా పోస్టులు మంజూరు కాకుండా ఏడు ఒకేషనల్ కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ప్రత్యేక జాబితాను పంపాలని సూచించారు.
తప్పుల్లేకుండా జాబితా పంపాలి : టీఎస్‌జీసీసీఎల్‌ఏ
కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సంబంధించిన జాబితాను తప్పుల్లేకుండా ప్రభుత్వం అడిగిన వివరాల ప్రకారం పంపించాలని టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475 అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 150 రోజులపాటు సమయం తీసుకుని ఇంటర్ విద్యా కమిషనర్ తప్పుడు వివరాలతో జాబితాను ప్రభుత్వానికి పంపించడం విచారకరమని విమర్శించారు. అందరి పేర్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.