Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు(రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి) ఐదో సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో జరిగింది. ఆ బోర్డు వైస్‌చైర్మెన్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. అదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో చేపట్టిన రోడ్ల విస్తరణ, విద్యుత్ ఆధునీకరణ, టీ ఫైబర్ గ్రిడ్ పనుల అనుమతులపై చర్చించారు. వైల్డ్ లైఫ్ బోర్డులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే అటవీ ప్రాంతానికి వీలైనంత తక్కువ నష్టం జరిగే విధంగా ప్రతిపాదనలు రూపొందించామని మంత్రి చెప్పారు. పీసీసీఎఫ్ హెచ్ఓఓఎఫ్ ఆర్ఎం. డోబ్రియల్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి అనుమతులు పూర్తయిన తర్వాత అవసరమైతే కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డుకు పంపుతామని తెలిపారు. కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని పర్యవేక్షించడం, వరద బాధితులను ఆదుకునే క్రమంలో మంత్రి కృషిని బోర్డు సభ్యులు ప్రశంసించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్, ఎంసీ పర్గెయిన్, డీసీఎఫ్ శ్రీనివాసరావు, స్టేట్ బోర్డు ఆఫ్ వైల్డ్ లైఫ్ సభ్యులు పాల్గొన్నారు.