Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలే కారణం
- మునుగోడు పరిస్థితులపై స్థానిక నేతలతో అధిష్టానం ఆరా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సొంతపార్టీపై విమర్శల బాణం ఎక్కుపెడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఏఐసీసీ సీరియస్ అయింది. పదే పదే కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయన్ను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పార్టీపైన్నే కాకుండా నాటి పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ప్రస్తుత అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డిని సైతం ఆయన వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. హస్తం గుర్తుపై గెలిచిన కోమటిరెడ్డి గత కొంత కాలంగా ఆ పార్టీని బలహీనపరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సైతం పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొంతమంది చేయని తప్పుకు కూడా షోకాజ్ నోటీసులు ఇస్తున్న పార్టీ...రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందనీ, రోజురోజూకు కాంగ్రెస్ బలహీన పడుతున్నదని విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర పార్టీకి లేకపోవడంతో నేరుగా అధిష్టానం రంగంలోకి దిగింది. ఉమ్మడి నల్గొండ నేతలతోనూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఏ క్షణమైనా సస్పెన్షన్ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని షోకాజ్ నోటీస్ లేకుండానే సస్పెన్షన్ వేటు వేయనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అంతకు ముందు పార్టీ బలం ఏ విధంగా ఉన్నది. ఇతర పార్టీల బలబలాలు ఏ విధంగా ఉన్నాయి? రాజకీయ సమీకరణాలు తదితర అంశాలపై చర్చించేందుకు స్థానిక నేతలు కైలాస్ నేత, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్ అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. ఎమ్మెల్మే రాజీనామా చేస్తే, రానున్న ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం చేసేందుకు వారిని ఢిల్లీకి ఆహ్వానించారు. గతంలో పార్టీ క్రమశిక్షణను రాజగోపాల్‌రెడ్డి ఉల్లంఘించినప్పటికీ ఆయనకు, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని ఏఐసీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.