Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్ఈ ముట్టడిలో టీఆర్టీఎఫ్ నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) అధ్యక్షులు కావలి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ డిమాండ్ చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్ఈ) కార్యాలయాన్ని టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన తెలిపేందుకు వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్, రమేష్ మాట్లాడుతూ గత ఏడేండ్లుగా ఉపాధ్యాయ పదోన్నతులు, నాలుగేండ్లుగా బదిలీల్లేవని చెప్పారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 467 ఎంఈవో పోస్టులను ఏండ్ల తరబడి భర్తీ చేయకుండా ప్రాథమిక విద్య ఎలా బలోపేతం అవుతుందని ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖలో 20 వేల ఖాళీలున్నా, పదోన్నతులిఇవ్వటం లేదని చెప్పారు. 317 జీవోను ఏకపక్షంగా విడుదల చేశారనీ, 13 జిల్లాలను బ్లాక్ చేసి స్పౌజ్ కేటగిరి టీచర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ జిల్లాల్లో నిషేధాన్ని ఎత్తేసి భార్యాభర్తలు ఒకేజిల్లాలో పనిచేసేలా చూడాలని కోరారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు.
ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలనీ, కేజీబీవీ టీచర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలనీ, బదిలీలు చేపట్టాలనీ, రెగ్యులర్ టీచర్లతో సమానంగా 27 క్యాజువల్ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మానేటి ప్రతాపరెడ్డి, చీఫ్ ప్యాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, మాజీ అధ్యక్షులు ఎల్లాల లక్ష్మారెడ్డి, ముప్పిడి మల్లయ్య, నాయకులు విష్ణుమూర్తి, రాంరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, డేనియల్, మురళి తదితరులు పాల్గొన్నారు.