Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ఛార్జీ డీఎంఈని తొలగించాలిొ డీఎంఈ పోస్టును సృష్టించాలి
- 15 రోజుల్లో పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెొరాష్ట్ర వైద్యారోగ్యశాఖ
- కార్యదర్శికి టీటీజీడీఏ లేఖొ డీఎంఈ కార్యాలయం ముందు నిరసన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ డిమాండ్లను 15 రోజుల్లో పరిష్కరించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీకి లేఖ రాసింది. లేకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో నిరసనల్లో భాగంగా మూడో రోజు బుధవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముందు టీటీజీడీఏ రాష్ట్ర నాయకులు, ఆయా యూనిట్లు నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ఇన్చార్జీ డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి డా జలగం తిరుపతి రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, డా ప్రతిభా లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు గడుస్తున్నా... డీఎంఈ పోస్టును సృష్టించకపోవడం, ఇన్‌చార్జీగా జూనియర్‌ను కొనసాగించడంపై అసహనం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో బోధనా వైద్యులు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ప్రశ్నించిన ఉద్యోగులను ఇన్ ఛార్జీ డీఎంఈ వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. వైద్యుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించడంలో డాక్టర్ రమేశ్ రెడ్డి అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్-19 సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తే తమకు రావాల్సిన 56 నెలల పీఆర్సీని డీఎంఈ మంజూరూ చేయలేదని విమర్శించారు. శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టును సష్టించాలనీ, 56 నెలల పీఆర్సీ బకాయిలను చెల్లించాలనీ, సాధారణ బదిలీలను చేపట్టాలనీ, ఈఎల్ ఎన్క్యాష్మెంటు, కెరీర్ అడ్వాన్సుమెంటు స్కీం అమలు చేయాలనే డిమాండ్లతో డాక్టర్లు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం అధ్యక్షులు డా.అన్వర్, కోశాధికారి డా.కిరణ్ ప్రకాష్, లోకల్ యూనిట్ అద్యక్షులు, కార్యదర్శులు, ట్రేజరర్లు, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, బోధనాస్పత్రుల్లో మూడో రోజు డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కొనసాగించారు.