Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం డిమాండ్
- కేంద్ర సర్కారు దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాడి రైతులకు నష్టం కలిగించేలా ఉన్న పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పన్ను రద్దు చేయాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్ చేసింది. అఖిల భారత పాడి ఉత్పత్తిదారుల సమాఖ్య పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ వద్ద ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత పాడి ఉత్పత్తిదారుల సమాఖ్య కేంద్ర కమిటీ సభ్యులు మూడ్ శోభన్ మాట్లాడుతూ పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, లస్సి, మజ్జిగ ప్యాకెట్ల పై ఐదుశాతం, పాల సేకరణ, శీతలీకరణ, పాల ఉత్పత్తుల తయారీకి వినియోగించే పరికరాలు, యంత్రాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతం కేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. ఫలితంగా సహకార పాడి డైయిరీలపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలు సరఫరా చేసే గ్రామ పాల సొసైటీలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. రైతులకు చెల్లించే పాల ధరలో కోతలు విధించడం, బోనస్ తగ్గించడం తప్పనిసరి అవుతుందని చెప్పారు. ఇప్పటికే ఖర్చులు పెరిగి రైతులకు పాల ఉత్పత్తి గిట్టుబాటు కాకుండా ఉన్నదని చెప్పారు. అందువల్ల ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలనీ, పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, డీివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, సహాయ కార్యదర్శి తాటికొండ రవి, లెనిన్, నవీన్, కపిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.