Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
- ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న స్పెషలాఫీసర్ల (ఎస్వో)కు మోడల్ స్కూల్ హాస్టల్ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మోడల్ స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల వసతి గృహాల నిర్వహణ బాధ్యత తమది కాదంటూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమీపంలోని కేజీబీవీ ఎస్‌వోలకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు. కేజీబీవీలకు దగ్గరలోని మోడల్ స్కూళ్ల హాస్టళ్లకు పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా ఎస్వోలు వ్యవహరించాలని ఆదేశించారు. ఆర్థిక, పరిపాలనా పరమైన పూర్తి బాధ్యత వారే తీసుకోవాలని సూచించారు. ఇందుకనుగుణంగా డీఈవోలు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మాయిల హాస్టళ్లకు సంబంధించిన రిజిస్టర్లను కేజీబీవీ ఎస్‌వోలకు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, డీఈవో కార్యాలయంలోని ఎఫ్‌ఏవోకు ఉమ్మడి బ్యాంకు ఖాతాలున్నాయని వివరించారు. దాన్ని కేజీబీవీ ఎస్వో, డీఈవో కార్యాలయంలోని ఎఫ్ఏవో పేరు మీదకు మార్చాలని కోరారు. మోడల్ స్కూల్ అమ్మా యిల హాస్టళ్లలో ఖాళీల భర్తీకి కలెక్టర్ల నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. ఔట్సోర్సింగ్ విధానంలో అమ్మాయిల హాస్టళ్లలోని తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో ఖాళీల ను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కేర్‌టేకర్ కమ్ వార్డెన్‌గా తాత్కాలిక పద్ధతి అదనపు బాధ్యతలు నిర్వహించే వారికి గౌరవ వేతనం నెలకు రూ.8,710 నుంచి రూ.12,500కు పెంచామని వివరించారు. కేజీబీవీ ఎస్‌వోలకు పూర్తిస్థాయి ఇన్ఛార్జిలుగా నియమించే వారికి నెలకు రూ.2,500 వేతనం ఇవ్వనున్నట్టు స్ప ష్టం చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తా యని తెలిపారు. కేజీబీవీ ఎస్‌వోలకు మోడల్ స్కూల్ అమ్మాయిల హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించ డాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి : టీఎస్‌యూటీఎఫ్
కేజీబీవీ ఎస్‌వోలకు మోడల్ స్కూల్ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తీవ్రంగా ఖండించారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పలు కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ విద్యను ప్రారంభించారని గుర్తు చేశారు. విద్యార్థినిల సంఖ్య పెరిగిందని తెలిపారు. పాఠశాలల్లో వసతుల కొరతతోపాటు నిర్వహణలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాఠశాల, కళాశాలల పర్యవేక్షణ, వసతి గృహ నిర్వహణ ఎస్‌వోలకు భారంగా మారిందని తెలిపారు. ఇప్పుడు సమీపంలోని మోడల్ స్కూల్ హాస్టళ్లను చూడాలంటే పాఠశాల, కళాశాల పర్యవేక్షణ గాలికొదిలేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేజీబీవీల ఫలితాలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అధికారులు ఇలాంటి అనాలోచిత నిర్ణయాలే విద్యాశాఖలో తీవ్రమైన అశాంతికి కారణమవుతున్నాయని విమర్శించారు. కేజీబీవీ సిబ్బందిని మొత్తం కాంట్రాక్టు పద్ధతిలో నియామించారని తెలిపారు. వారికి పనికి తగిన వేతనం ఇవ్వటం లేదని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు కనుక ఏ బాధ్యత ఇచ్చినా చేస్తారనే ధీమా తో అధికారులు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు కనపడుతు న్నదని తెలిపారు. ఇప్పటికే కేజీబీవీల్లో ఏ చిన్న పొర పాటు జరిగినా కనికరం లేకుండా ఎస్‌వోలను ఉద్యో గం నుంచి తొలగిస్తున్నారని వివరించారు. ఎస్‌వోల జాబ్చార్ట్లోగానీ కాంట్రాక్టు ఒప్పందంలోగానీ లేని అదనపు బాధ్యతలను వారికెలా అప్పగిస్తారని ప్రశ్ని ంచారు. ఈ బాధ్యతలను కేజీబీవీ ఎస్వోలందరూ మూకుమ్మడిగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
ఇది సరైంది కాదు : టీపీటీఎఫ్
మోడల్ స్కూల్ బాలికల హాస్టళ్ల నిర్వహణ బాధత్యలను కేజీబీవీ ఎస్‌వోలకు అప్పగించడం సరైంది కాదని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ విమర్శించారు. వార్డెన్ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ బాధ్యతలు ప్రిన్సిపాళ్లకే ఉండేలా ఉత్తర్వులను మళ్లీ సవరించా లని కోరారు. మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో విద్యాప్రమాణాలు కాపాడేలా అన్ని కేటగిరీల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అసంబద్ధమైన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.
తప్పుడు ఉత్తర్వులను ఉపసంహరించాలి : డీటీఎఫ్
కేజీబీవీ స్పెషలాఫీసర్లకు మోడల్ స్కూల్ హాస్ట ల్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ ఇచ్చిన తప్పు డు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డీటీఎఫ్ అధ్యక్షులు ఎం రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి టి లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాల వల్ల కేజీబీవీల పనివిధానం, ఫలితా లపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.