Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ సాహితి రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సలీమ రచించిన కథల సంపుటి 'పథగమనం' పుస్తకాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి 91వ జయంతి ఉత్సవాలు బుధవారంనాడిక్కడ జరిగాయి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రచురించిన వర్ధమాన రచయిత్రుల పుస్తకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు డాక్టర్ సీ నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని పరిషత్తు పక్షాన ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు ప్రదానం చేశారు. ప్రాంగణంలోని డాక్టర్ సినార్డే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం సినారె అని కొనియాడారు. సినారె కుటుంబం ఆధ్వర్యంలోని శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు వారు సొంత ఖర్చుతో ముద్రించిన మైదాకు వసంతం (కోట్ల వనజాత), ఉషోదయం (గంటి ఉషాబాల), పథగమనం (షేక్ సలీమా) కథా సంపుటాలు, అక్షరనేత్రాలు (లహరి), స్నేహగానం (డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి), మౌనమేఘాలు (స్వాతికష్ణ సన్నిధి), చైతన్య బాలు (దరిపల్లి స్వరూప) కవితా సంపుటాలను, ఆకురాయి (ఉప్పల పద్మ) విమర్శ వ్యాసాల సంపుటిని ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఏ సిల్మానాయక్తో పాటు సినారె కుటుంబ సభ్యులు, సాహితీవేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.