Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంటజలాశయాల నుంచి ఉధృత ప్రవాహం
- బ్రిడ్జీలపై రవాణా బంద్
- పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్
- ఎప్పటికప్పుడూ పరిస్థితులను సమీక్షిస్తున్న అధికారులు
- ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచన
నవతెలంగాణ-సిటీబ్యూరో
మూసీ ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. పై నుంచి వరద ప్రవాహం వల్ల హైదరాబాద్ జంట జలాశ యాలు నిండి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పూర్తి గేట్లను ఎత్తేశారు. దాంతో మూసీ నదిలో వరద ప్రవాహం ఉధృతంగా పారుతోంది. శివారు ప్రాంతాలు, పాత బస్తీల్లోని పలు కాలనీల్లోకి వరద చొచ్చుకొచ్చింది. ఎప్పుడు ఎటువైపు నుంచి వరద దూసుకొస్తుందోనని ప్రజలు హడలిపోతున్నారు. చాదర్‌ఘాట్, మూసారంబాగ్ వంతెనలపై నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది. మరో రెండ్రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లో పరిస్థితిపై ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కేటీఆర్.. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
రాకపోకలకు తీవ్ర అంతరాయం
వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ నుంచి భారీగా వరద నీటిని మూసీలోకి వదిలారు. దాదాపు 21 వేల క్యూసెక్కుల వరద నీరు మూసీలో చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ 13 గేట్లు, హిమాయత్‌సాగర్ 8 గేట్లు ఎత్తేశారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ ఇన్‌ఫ్లో 7500 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 8281 క్యూసెక్కులు ఉంది. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 7000 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 7,708 క్యూసెక్కులు ఉంది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలావుండగా మూసీనది ఉధృతితో అప్రమత్తమైన అధికారులు పరివాహక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూసారంబాగ్, చాదర్‌ఘాట్, పురానాపూల్ వంతెనలపై రాకపోకలను నిలిపేశారు. నగర శివార్లో, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరదనీరు పెరుగుతుండడంతో పరిస్థితిని సమీక్షించిన పోలీస్ అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.
జలాశయాలను సందర్శించిన జలమండలి
ఎండీ దానకిశోర్
జంట జలాశయాలను బుధవారం ఉదయం జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. సామాన్య ప్రజలు, సందర్శకులు జంట జలాశయాల వద్దకు రావొద్దని చెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జలమండలి, జీహెచ్ఎంసీ, పోలీసుల శాఖకు సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో జలమండలి నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. గత సంవత్సరం ఒక్క హిమాయత్ సాగర్ నుంచే 26 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఈసారి రెండు జలాశయాల నుంచి కలిపి కూడా గతసారి కంటే తక్కువ నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ట్రాన్స్మిషన్ సీజీఎం దశరథరెడ్డి, జీఎంలుల, డీజీఎంలు పాల్గొన్నారు.
రెండ్రోజుల నుంచి రాకపోకలు నిలిపివేత
నవ తెలంగాణ -భూదాన్ పోచంపల్లి
భారీ వర్షాలు.. వరదల నేపథ్యంలో మూసీ నది ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. యాదాద్రిభువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు, బీబీనగర్ మండలం రుద్రవెల్లి గ్రామాల మధ్యన ఉన్న వంతెనపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో రెండ్రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. జూలూరు, కప్రాయపల్లి, పెద్దగూడెం, పోచంపల్లి, బీబీనగర్ నుండి నాగాపురం, రుద్రవెళ్లి, పల్లెగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉధృతంగా వాగు
నవతెలంగాణ-తాడ్వాయి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 150 మంది వ్యవసాయ కూలీలు, గ్రామస్తులు చిక్కుకున్నారు. రోజు మాదిరిగానే వివిధ పనుల కోసం సంతాయిపేట గ్రామానికి చెందిన పలువురు కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం పడటంతో వాగు ఉధృతంగా ప్రవహించింది.
ఈ ఉధృతికి ప్రయాణానికి కూడా వీలులేకుండా ఉండటంతో కూలీల అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న తాడ్వాయి ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బందితో వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. వరద ఉధృతి తగ్గితే ట్రాక్టర్ల సహాయంతో ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.