Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
'అప్పు ముప్పు' శీర్షికతో నవతెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనంపై టీఎస్ఆర్టీసీ యాజమాన్యం పరోక్షంగా స్పందించింది. 'అప్పు ముప్పు' పై ఉన్న ముసు గును తొలగించుకునే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఈనెల 16వ తేదీతో కూడిన ఓ సర్క్యులర్‌ను చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎమ్) పేరుతో విడుదల చేసింది. ఈ సర్క్యులర్ పాత తేదీతో బుధవారం విడుదల చేసినట్టు తెలిసింది. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రుణాలు తీసుకున్న ఆర్టీసీ కార్మికులు ఈనెల 25వ తేదీలోపు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) ఫారాలను లోన్ ఉన్న బ్యాంకులో ఇవ్వాలనేది ఆ సర్క్యులర్ సారాంశం. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఆదేశాలు ఇచ్చినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గేట్ మీటింగ్స్ పెట్టి ఈ విషయంపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆ మేరకే బుధవారం పలు డిపోల్లోని నోటీసు బోర్డుల్లో నోటీసులు ప్రత్యక్షమయ్యాయి. సూర్యాపేట డిపోలో 27 జులై 2022 తేదీతో డిపో మేనేజర్ శంకర్ పేరుతో 'ప్రకటన' నోటీసుబోర్డులో పెట్టారు. ''కార్పొరేట్ ఆఫీసు నుంచి ఎస్బీఐ బ్యాంక్‌లో 213 మంది లోన్ తీసుకున్నారని ఉత్తర్వులు వచ్చాయి. లిస్టులో తెలుపబడిన ఉద్యోగులు కంట్రోలర్ చార్ట్ వద్ద ఉన్న ఈసీఎస్ ఫారాలు నింపి సంతకము చేసి, వారు లోన్ తీసుకున్న బ్యాంక్‌లో 29 జులై 2022 లోపు సమర్పించాలి. లేని ఎడల తదుపరి పరిణామాలకు వారే బాధ్యులు'' అనేది నోటీసు బోర్డులోని ప్రకటన సారాంశం. సీపీఎమ్ ఈనెల 16వ తేదీతో ఇచ్చిన సర్క్యులర్‌లో జులై 25లోపు ఈసీఎస్ ఫారాలు తీసుకోవాలని ఉంటే, డిపో మేనేజర్ ప్రకటనలో 29వ తేదీ లోపు ఈసీఎస్ ఫారాలు ఇవ్వాలని ఉండటం గమనార్హం. దీనిపై ఓ డిపో మేనేజర్ 'నవతెలంగాణ'తో మాట్లాడుతూ సీపీఎమ్ సర్క్యులర్ బుధవారమే తమకు అందిందని తెలిపారు. నవతెలంగాణ బుధవారంనాటి దినపత్రికలో ఎస్బీఐ నుంచి యూబీఐ కి బ్యాంకు ఖాతాలు మార్చడం వల్ల ఆర్టీసీ కార్మికులు అంతకు ముందు తీసుకున్న ఎస్బీఐ రుణాలను చెల్లించలేకపోయారనీ, దీనితో వారి ఖాతాలన్నీ నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) జాబితాలోకి చేరాయని తెలుపుతూ 'అప్పు ముప్పు' శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వార్త ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.