Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేట్రేగుతున్న రౌడీ మూకలు
- విచ్చలవిడిగా భూ కబ్జాలు
- వసూళ్లకు తెగబడిన పోలీసు అధికారులు..!
- మంత్రి మౌనం వెనుక మర్మమేంటి..?
- మార్క్సిస్టుల పాలన నాటి ప్రశాంతతను గుర్తు చేస్తున్న ప్రజానీకం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నగరంలో నిత్యం ఏదో ఒక గడిబిడి.. ప్రతిరోజూ ఏదో ఒక చోట కబ్జాలు.. ప్రతి దురాక్రమణ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నటునఠ ఆరోపణలు.. సెటిల్మెంట్లు, దందాలు...ఇవన్నీ సర్వసాధారణమయ్యాయి. ఇప్పుడు ఏకంగా పోలీసు అధికారులే అరాచకాలకు సారథ్యం వహిస్తున్నట్టు సోషల్‌మీడియా వేదికగా వీడియో రికార్డులు చక్కర్లు కొడుతున్నాయి. రౌడీమూకలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని వారం రోజులుగా వినిపిస్తున్న వార్త. ఓ పోలీసు అధికారి తనను అరాచకం దిశగా ప్రేరేపించారని.. ఓ రౌడీషీటర్ వీడియో రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. ప్రెస్‌మీట్ పెట్టి మరీ తేటతెల్లం చేయాలనే అతని ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం.. ఆపై అతన్ని జైలుకు పంపడం.. వంటి ఉదంతాలు నగరంలో శాంతిభద్రతపై నెలకొన్న సందేహాలకు నిదర్శనంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్ మిన్నకుండటం వెనుక మర్మమేంటీ.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మార్క్సిస్టు పాలనలో సుఖశాంతులతో..
ఖమ్మం పురపాలక సంస్థగా ఉన్నంత కాలంలో ఎక్కువ రోజులు మార్క్సిస్టుల ఏలుబడిలోనే పాలన సాగింది. చిర్రావూరి లక్ష్మీనర్సయ్య మొదలు అఫ్రోజ్‌సమీనా వరకు సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు చైర్మెన్లుగా ఉన్నంత వరకూ నగరంలో ఏ ఒక్కరోజూ కబ్జా ముచ్చట్లు, సెటిల్మెంట్లు, దందాల మాటలు వినిపించలేదని, సమస్త ప్రజానీకం ప్రశాంతంగా జీవించేదని నగర ప్రజల మాట. మార్క్సిస్టు పాలన.. నేటి పరిస్థితులను బేరీజు వేసుకుని ఖమ్మం 'కారు'మబ్బులకు పాలనయంత్రాంగంలోని కొందరి 'గులాం'గిరీయే కారణమనే వాదన వినిపిస్తోంది.
'అధికారం' మాటునే అన్నీ...!
సాయిగణేష్ ఉదంతం మొదలు నేటి వరకూ నిత్యం నగరంలో ఏదో ఒక వివాదం.. ప్రతి దానిలోనూ అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన మరణానికి ఓ కార్పొరేటర్, ఓ పోలీసు అధికారితో పాటు మరొకరు కారణమని సాయి మరణవాగ్మూలంగా ఓ వీడియో చిత్రీకరించాడు. దాని ఆధారంగా ఇప్పుడు కోర్టు విచారణ కొనసాగుతోంది. ఆ తర్వాత ఓ ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్ల భర్తల కనసన్నల్లో కబ్జా ఉదంతం నగరంలో చర్చనీయాంశమైంది. ఇది మంత్రి వరకూ వెళ్లినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల డబుల్ బెడ్రూంల దందా వెనుక కూడా 'కారు' పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేయాల్సిందిగా మంత్రి పోలీసులను ఆదేశించారు. ఖమ్మం అర్బన్ (హవేలీ) పోలీసుస్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కానీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు, మరికొందరు మంత్రి వెంట తిరుగుతుండటం, ఇప్పటి వరకూ ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక తాజాగా పోలీసు అధికారిపై ఓ రౌడీషీటర్ చేసిన ఆరోపణలు సైతం అధికారపార్టీనే వేలెత్తి చూపేలా ఉన్నాయి. ఆరోపణలపై బదిలీ అయిన పోలీసు అధికారితో పాటు ప్రస్తుత పోలీసు అధికారి కూడా మంత్రి సామాజికవర్గీయులే కావడంతో తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు ఆఫీసర్‌కు 'అధికారం' అండ లభిస్తోందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
పోలీసు అధికారుల తీరుపై ఆక్షేపణలు...
'వాడుబోతే వీడు.. వీడు బోతే వాడు...' అనే సినిమా డైలాగ్ తరహాలో వివిధ ఆరోపణలపై ఒక పోలీసు ఆఫీసర్‌ను బదిలీ చేస్తే ఆయన స్థానంలో వచ్చిన మరో పోలీసు అధికారి అంతకు రెట్టింపు...వసూళ్లకు పాల్పడుతున్నారని వదంతులు వస్తున్నా ఎటువంటి విచారణ జరగకపోవడం సందేహాలకు తావిస్తోంది. రౌడీషీటర్ మాటల ప్రకారం గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సీఐలను ఫనిష్మెంట్ కింద బదిలీ చేశారు. కానీ ప్రస్తుతం అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపై ఎటువంటి విచారణ కొనసాగకపోవడం సందేహాలకు తావిస్తోంది. దీన్నిబట్టి అధికారపార్టీ 'అభయం' ఉంటే ఎటువంటి చర్యలు ఉండవు కాబోలు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సీపీ విచారణ నిర్వహించాలి...
నగరంలో చోటు చేసుకుం టున్న ఘటనలపై కమిషనర్ ఆఫ్ పోలీస్ విచారణ నిర్వహించాలి. మరోమారు పునరావృతం కాకుం డా చూడాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. జిల్లాలో మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. వరుస ఘటన లు చోటుచేసుకుంటున్నా స్పందించాల్సిన నేతలు మౌనంగా ఉండటం ఎటువంటి సంకేతాన్నిస్తోంది ఆలోచించాలి.
- యర్రా శ్రీకాంత్, సీపీఐ(ఎం)
రాష్ట్ర కమిటీ సభ్యులు