Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దల ఆధీనంలో ప్రభుత్వ భూములు
- బయటకు తీసి పేదలకు పంచాలి:
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
- పనిలేక వలస పోతున్న వ్యవసాయ కార్మికులు:
- అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ- తిరుమలగిరి
పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణ కేంద్రంలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్లో గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించిన భూసదస్సులో పాల్గొన్న రాఘవులు.. డప్పు కొట్టి భూపోరాట ఉద్యమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. దానిని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఆక్రమించుకొని దశాబ్దాలుగా అనుభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎలాంటి ఆధారం లేని పేదలు 60 గజాలలో గుడిసెలు వేసుకుంటే.. వారిపై అక్రమ కేసులు పెడుతూ గుడిసెలను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆక్రమించిన భూములను ప్రభుత్వానికి దమ్ముంటే వెలికి తీయాలని సవాల్ విసిరారు. దళితులకు మూడెకరాల సాగుభూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. టీిఆర్ఎస్ ఎనిమిదేండ్ల పాలనలో ఏ ఒక్కరికీ ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. పేదల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్.. గత తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల లాగానే శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు వచ్చే వరకు ఎర్ర జెండా వారికి అండగా ఉంటుందని చెప్పారు. కేసులు పెట్టినా, నిర్బంధాలకు గురిచేసినా వెనకడుగు వేయకుండా సమరశీల పోరాటాలకు పేదలు, వ్యవసాయ కార్మికులు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. దేశంలో నూటికి 70 శాతంగా ఉన్న వ్యవసాయ కార్మికులు సంపదను సృష్టిస్తున్నారని చెప్పారు. వారికి ఉండటానికి ఇల్లు, వైద్యం, పిల్లల చదువు అందని ద్రాక్షగా మారిందన్నారు. వ్యవసాయ రంగంలో యంత్రాలు ప్రవేశించిన తర్వాత కూలీలకు చేతినిండా పని లేక.. పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సదసుకు ముందు తెలంగాణ చౌరస్తా నుంచి భారీ ప్రదర్శన నిర్వహించారు. డప్పు కొట్టి ప్రజా సమస్యలపై సమర శంఖం మోగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు, సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలిది పద్మావతి, మట్టిపల్లి సైదులు, కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తదితరులు పాల్గొన్నారు.