Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక లేమితో కుదేలైన విత్తన పరిశోధనా కేంద్రం
- నూనె గింజలు, చిరు ధాన్యాలకు మార్కెట్ వ్యవస్థ లేదు
- ప్రత్యామ్నాయ రంగాలు బలోపేతం చేయాలి: శాస్త్రవేత్తలు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వ్యవసాయ దేశంగా పేరుగాంచిన భారతావనిలో నూతన వంగడాల పరిశోధనలకు నిధుల కేటాయింపులు.. ప్రోత్సాహమూ కరువైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమ క్రమంగా నిధుల కేటాయింపులు తగ్గించడమే కాకుండా.. రూపొందించిన వంగడాల ప్రచారానికీ ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం అందించడం లేదు. నూతన వంగడాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన పరిశోధనా సంస్థ ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతోంది. కనీసం నూనె గింజలు, చిరు ధాన్యాల విక్రయాలకు సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ప్రత్యామ్నాయ రంగాలను బలోపేతం చేస్తే కొంత మేరకైనా ఉపయోగం ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు నూతన వంగడాల ఉత్పత్తికి తగిన ప్రోత్సాహం అందించాలని విద్యావంతులు, మేధావులు కోరుతున్నారు.
వ్యవసాయంలో నూతన వంగడాలను ఉత్పత్తి చేయడానికి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో పరిశోధనా స్థానాన్ని ఏర్పాటు చేశారు. 180 ఎకరాల్లో ఈ పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయగా.. 20 మంది శాస్త్రవేత్తలున్నారు. మరో 8 మంది శాస్త్రవేత్తలను నియమించాల్సి ఉంది. ఇక్కడ నాణ్యమైన వంగడాలను తయారు చేస్తున్నారు. ప్రధానంగా ఆముదంలో క్రాంతి విత్తనం దేశంలోనే అత్యధిక దిగుబడినిచ్చేదిగా గుర్తింపు పొందింది. పీసీహెచ్ 111 సంకర జాతి ఆముదం కూడా అధిక దిగుబడినిస్తోంది. హరిత, కిరణ్, ప్రగతి వంటి రకాలు అధిక దిగుబడినిస్తున్నాయి. ఇవన్నీ పాలెం పరిశోధనా కేంద్రంలోనే కనిపెట్టారు. చిరు ధాన్యాలకు పెట్టింది పేరుగా ఉన్న పాలెం పరిశోధనా స్థానం ద్వారా రైతులకు నూతన వంగడాలు అందజేయడంతోపాటు వాటికి గిట్టుబాటు ధరలు, మార్కెట్ వ్యవస్థ, పరిశ్రమల ఏర్పాటు వంటివి చేయాల్సి ఉంది. అప్పుడే సాగులో మెరుగైన అవకాశాలు రైతులకు అందుతాయి.
అయితే, దేశంలో అవసరాలకు తగినట్టుగా ఆహార ఉత్పత్తులు సాగు కావడం లేదు. కేంద్రం విధానాలతో పప్పు, నూనెను ఇతర దేశాల నుంచి అధిక మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నూనె గింజలైన వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమలు, నువ్వులు వంటి పంటల సాగు పెంచాల్సిన అవసరం ఉంది. తక్కువ ఖర్చు, అధిక పోషక పదార్థాలున్న వాటిని అధికంగా సాగు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనా సంస్థలను పట్టించుకోవడం లేదు. అన్నిటినీ ప్రయివేటుకు ఇస్తూ.. రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే పనిలో పడిందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
కన్పించని మార్కెట్ వ్యవస్థ
వనపర్తి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో
వేరుశనగ సాగవుతోంది. ఆ ప్రాంత అవసరాలకు మించి సాగవుతోంది. అక్కడ మార్కెట్ వ్యవస్థతోపాటు ఆయిల్ కంపెనీలు లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో నూనె గింజల సాగు పట్ల రైతులు ఆసక్తి చూపడం లేదు. సాగైన ఉత్పత్తుతులను విక్రయించేలా మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అవసరానికి మించి సాగు చేస్తున్న వరిని తగ్గించి వాణిజ్య పంటలను సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వాలు పరిశోధనలకు తగిన ప్రోత్సాహాలు అందించాలని రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కోరుతున్నారు.
చిరు ధాన్యాలతో అధిక లాబాలు
చిరు ధాన్యాలైన కుసుమ, పొద్దుతిరుగడు, కందితోపాటు వేరుశనగ వంటి పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందొచ్చు. వరి సాగు రైతులకు భారం పెరిగింది. పెట్టుబడి కంటే దిగుబడి తగ్గి నష్టాలపాలౌతున్నారు. అవసరాలకు మించి సాగయ్యే వరికంటే అధిక ధరలున్న నూనె, పప్పులను సాగు చేయాలి. హైదరాబాద్‌లోనే ప్రతి రోజూ 350 లారీల మాంసాన్ని తింటున్నారు. పట్టణం చుట్టూ ఉండే రైతులు కోళ్లు, గొర్రెల ఉత్పత్తిని పెంచాలి. గుడ్లు, పాలు, మాంసం అవసరానికి సరిపడా లేకపోవడంతోనే ధరలు అధికంగా ఉన్నాయి. రైతులు వాణిజ్యపరమైన వాటిని ఉత్పత్తి చేసేందుకు ముందుకు రావాలి.
- గోవర్థన్‌రెడ్డి- ఏడీఆర్- పాలెం పరిశోధన కేంద్రం- నాగర్‌కర్నూల్ జిల్లా