Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వీఆర్ఏ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పేస్కేలు, ఉద్యోగభద్రత, వారసత్వ ఉద్యోగాలు, తదితర డిమాండ్ల కోసం తమ నిరసనలు యధావిధిగా కొనసాగుతాయని వీఆర్ఏ జేఏసీ స్పష్టం చేసింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్ఏల జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ ఎం.రాజయ్య, కో-కన్వీనర్ రమేశ్ బహుదూర్, సెక్రటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కన్వీనర్ డి.సాయన్న, కో-కన్వీనర్లు వంగూరు రాములు, ఎస్కే మహ్మద్ రఫీ, వై.వెంకటేశ్‌రెడ్డి, కె.శిరీషారెడ్డి, ఎన్.గోవింద్, వై.యూసుఫ్ మీడియాకు వివరాలను వెల్లడిం చారు. శుక్రవారం నాడు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలుపుతామని చెప్పారు. 30న అర్ధ నగ ప్రదర్శనలు చేస్తామన్నారు. 31న వీఆర్ఏల కుటుంబాల్లోని చిన్నపిల్లలను సమ్మెలో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. ఆగస్టు 1న మండల కేంద్రాల్లో వంటావార్పు చేస్తామని ప్రకటించారు. 2న తహసీల్దార్ ఆఫీసులకు వచ్చే ప్రతి ఒక్కరికీ టీ ఇచ్చి తమ సాధకబాధకాలను చెప్పుకుంటామన్నారు. మూడో తేదీన సమ్మె శిబిరాల వద్ద రోడ్లను ఊడ్చి నిరసన తెలుపుతామన్నారు. నాలుగున డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఐదో తేదీన తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలిసి వేడుకుంటామని తెలిపారు. ఆరోతేదీన విద్యార్థి యువజన సంఘాలను మద్దతు ఇవ్వాలని సమ్మెశిబిరాల వద్దకు ఆహ్వానిస్తామన్నారు. 7న రెవిన్యూ డివిజన్ కేంద్రాల్లో చెవిలో పువ్వు చేతిలో చిప్ప పట్టుకుని భిక్షాటన చేస్తూ ప్రదర్శన చేస్తామని ప్రకటించారు. 8న సామాజిక సంఘాల మద్దతు కోరుతామన్నారు. 9న మొహరం( పీర్ల పండుగ ) సందర్భంగా సహఫంక్తి భోజన కార్యక్రమాలను పెట్టి వచ్చిన వారికి గోడు వెళ్లబోసుకుంటామని తెలిపారు. 10న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల మద్దతు కోరుతామన్నారు. 11న మండలంలోని సర్పంచ్‌లను సమ్మెశిబిరాల వద్దకు రావాలని వేడుకుంటామన్నారు. రాఖీపౌర్ణమి సందర్భంగా 12న ప్రజలకు రాఖీలు కడుతూ తమ బాధలను చెప్పుకుంటామన్నారు. 13న మండల కేంద్రంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను సమ్మె శిబిరాల్లో పాల్గొనేలా చేస్తామన్నారు. 14న సమ్మెశిబిరాల దగ్గర ఆటలు, పాటల పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. 15న సమ్మె శిబిరాల దగ్గర జెండాలను ఎగుర వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాలు చేసే సమయంలో తమ సమస్యలను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నా మన్నారు. ఈ నిరసనలకూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.