Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు చెప్పేందుకు అవకాశమివ్వని పోలీసులు
- మోడల్ స్కూల్ టీచర్ల డీఎస్ఈ ముట్టడి
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సహా జంగయ్య, లక్ష్మారెడ్డి, కొండయ్య, మహేష్ అరెస్టు
- బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కక్షకట్టింది. సమస్యలను ప్రభుత్వానికి చెప్పేందుకూ అవకాశమివ్వ లేదు. శాంతియుతంగా నిరసన చేపట్టకుండా పోలీసులు నిరంకుశత్వాన్ని ప్రదర్శించారు. ప్రజాప్రతినిధి, శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ నిరసనలో పాల్గొనడానికి వచ్చినా పోలీసులు కనీస గౌరవం ఇవ్వలేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్ఈ) కార్యాలయం వద్దకు ఆయన వస్తుంటే మధ్యలోనే అడ్డుకుని అరెస్టు చేయడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనం. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును పోలీసులు కాలరాస్తున్నారు. కొద్దిసేపు డీఎస్ఈ వద్ద బైఠాయించి నిరసన తెలిపే అవకాశాన్ని సైతం వారికి కల్పించలేదు. అధికారులను కలిసి సమస్యలను చెప్పేందుకు వీల్లేకుండా చేశారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సహా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) ఆధ్వర్యంలో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టిన డీఎస్ఈ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం వద్దకు వస్తున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సహా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, టీఎస్ఎంఎస్టీఎఫ్ అధ్యక్షులు బి కొండయ్య, కార్యదర్శి ఎస్ మహేష్‌తో పాటు వందలాది మంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌లోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ మోడల్ స్కూల్ టీచర్లు బదిలీలు, పదోన్నతుల కోసం తొమ్మిదేండ్లుగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షెడ్యూల్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014లో చేరిన 43 శాతం ఫిట్మెంట్ వర్తించని టీచర్లకు నోషనల్ సర్వీసు ఇస్తూ వేతన తేడాలు సవరించాలని కోరారు. అదనపు స్వీపర్, పీడీలను నియమించాలన్నారు. ఆరోగ్య కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. వారికి 010 పద్దు కింద జీతాలివ్వాలని సూచించారు. ఇంటర్‌విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు జేఎల్ పే స్కేల్ అమలు చేయాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలనీ, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపచేయాలన్నారు. మోడల్ స్కూళ్లలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య మాట్లాడుతూ పీజీటీ హిందీ పోస్టును మంజూరు చేయడం ద్వారా టీజీటీ హిందీ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సూచించారు. టీజీటీ సైన్స్ టీచర్లకు పనిభారం తగ్గించాలన్నారు. తరగతికి మరో 20 సీట్లను పెంచాలని కోరారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను కంప్యూటర్ ఆపరేటర్లుగా పరిగణించి జీతాలు పెంచాలని చెప్పారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్టీఎఫ్ ఉపాధ్యక్షులు క్రాంతికుమార్, రాధాకృష్ణ, సురేష్, కరుణాకర్, భాస్కర్‌రావు, విజేందర్, అనిల్‌కుమార్, శ్వేత, అయాస్, సోమయ్య, రబ్బాని, శ్రీనివాస్, సతీష్, లక్ష్మయ్య, చందన, స్వప్న తదితరులు పాల్గొన్నారు.