Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోమవారం నుంచి విచారణ షురు
- ప్రవీణ్ ల్యాప్‌టాప్‌లో 16 మందికి పైగా ఎమ్మెల్యేల పేర్లు
- క్యాసినోలో డ్యాన్సులు చేసిన టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
విదేశాల్లో కోట్ల రూపాయల్లో క్యాసినో నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలను సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నోటీసులను జారీ చేశారు. నేపాల్‌లోని ఒక స్టార్ హోటల్లో క్యాసినోను నిర్వహిస్తూ కోట్లాది రూపాయల వ్యాపారాన్ని ప్రవీణ్, మాధవరెడ్డిలు సాగించినట్టు ఆరోపించటమే గాక వారిపై పీఎంఎల్ఏ కేసులను ఈడీ నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, హైదరాబాద్‌లోని వారి కార్యలయాలు, ఆస్తులపై సోదాలు నిర్వహించిన ఈడీ.. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను, ప్రవీణ్, మాధవరెడ్డిలకు చెందిన వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లనూ కేంద్ర దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. వీటిని పరిశీలించిన ఈడీ తాము జరిపిన సోదాలలో కూడా ఇద్దరు నిర్వాహకులు సాగించిన క్యాసినో, పెద్ద ఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడ్డట్టు ఆధారాలను సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా, కొన్ని సీడీలు, వీడియో టేపులలో రికార్డయిన వీరిద్దరి క్యాసినో వ్యవహారాలు, కొందరు సినీ నటీమణులతో ఆట, పాట ల దృశ్యాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనపర్చుకున్నవాటిలో ఉన్నాయని సమాచారం. అంతేగాక, ప్రవీణ్, మాధవరెడ్డిలు నిర్వహించిన క్యాసినోలలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు దాదాపు 16 మందికి పైగా ఎమ్మెల్యేలున్నట్టు ల్యాప్‌టాప్ ఆధారంగా ఈడీ అధికారులు సమాచారం సేకరించినట్టు తెలిసింది. అంతేగాక, దాదాపు 20 మందికి పైగా టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ద్వితీయ శ్రేణి సినీ హీరోయిన్లు కూడా క్యాసినోలో డ్యాన్సులతో అలరించినట్టు కూడా ఈడీ ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఇందుకు గానూ వీరికి రూ. 25 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు పారితోషకం ముట్టజెప్పారని వినికిడి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సోమవారం నుంచి తమ దర్యాప్తును ఈడీ అధికారులు ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రవీణ్, మాధవరెడ్డి లతో విచారణ ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. వీరి తర్వాత తేలిన అంశాల ఆధారంగా కొందరు రాజకీయ ప్రముఖులను, పాల్గొన్నట్టు ఆరోపణలు వస్తున్న ద్వితీయ శ్రేణి హీరోయిన్లను కూడా ఈడీ విచారించనున్నట్టు సమాచారం.
కాగా, మద్రాసుకు చెందిన ఒక బంగారం వ్యాపారి వద్ద హవాలా ఏజెంటుగా పని చేస్తున్న ప్రవీణ్.. తనతో పాటు నలుగురు ఏజెంట్లన పెట్టుకొని విదేశాల్లో క్యాసినో వ్యాపారాన్ని విస్తరించినట్టు తెలుస్తున్నది. నేపాల్, ఇండోనేషియా, దుబారు, శ్రీలంక లతో పాటు దేశంలోని గోవాలో క్యాసినోలకు నిర్వాహకుడిగా ప్రవీణ్, మాధవరెడ్డిలున్నట్టు ఇప్పటికే ఈడీ సమాచారం సేకరించినట్టు తెలిసింది. కోట్లాది రూపాయలతో సాగే క్యాసినో వ్యవహారంలో డబ్బు లావాదేవీలన్ని కూడా హవాలా మార్గంలో సాగించేవారని ఈడీ ఆధారాలు సేకరించింది. దీని ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్న ఈడీ మున్ముందు పలువురు ప్రముఖుల పేర్లనూ ఈ వ్యవహారంలో బయట పెట్టనున్నదని సమాచారం.
ఈడీకే చెబుతా : ప్రవీణ్
ఇదిలా ఉండగా, క్యాసినో నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఈడీకే చెప్తానని తనను కలిసిన మీడియాతో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ చెప్పాడు. తాను చేస్తున్న వ్యాపారానికి సంబంధించి ఈడీకి కొన్ని సందేహాలున్నాయనీ, వాటినన్నిటినీ తీరుస్తానన్నాడు. ఇండోనేషియా, శ్రీలంకలో ఉన్న వ్యాపారాల గురించి విలేకరులు అడగగా.. వాటన్నిటి గురించి చెప్పాల్సిందేమీ లేదనీ, ఈడీతోనే మాట్లాడతానని సమాధానమిచ్చాడు.
తన కారు స్టిక్కర్‌ను వాడుకున్న ప్రవీణ్‌పై కేసు పెడుతున్నా : మంత్రి మల్లారెడ్డి
తన పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను చీకోటి ప్రవీణ్ తన ఫార్చునర్ కారుకు వాడుకోవటంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. 30 ఏండ్ల క్రితం బోయిన్‌పల్లిలో తన ఇంటి ముందటే ప్రవీణ్ కూడా నివాసముండేవాడనీ, తాను ఎమ్మెల్యే అయ్యాక బోయిన్పల్లి నుంచి తన ఇంటిని మార్చాననీ, ప్రవీణ్ ఎలా ఉంటాడో తానిప్పుడు గుర్తు కూడా పట్టలేని మల్లారెడ్డి వివరించారు. తనకు కేటాయించిన కారు స్టిక్కర్లు తన వద్దే ఉన్నాయనీ, తన పేరిట ఉన్న కారు స్టిక్కర్‌ను ప్రవీణ్ ఎలా సేకరించాడో తనకు తెలియదని మంత్రి స్పష్టం చేశారు.