Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని నేత కార్మికులకు రూ. 5లక్షల ఉచిత జీవిత బీమా ఇంకెప్పుడు కల్పిస్తారంటూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రసిడెంట్ దాసు సురేశ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆ ప్రకటన చేసి రెండేండ్లు గడుస్తున్నా నేటికీ అది అమలుకు నోచుకోలేదని తెలిపారు. గురువారం హైదరాబాద్లోని చేనేత జౌళి శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్ జ్యోతికి ఆయన ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. 2018 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల వేదికగా మంత్రి కేటీఆర్ రైతులకిచ్చిన మాదిరిగానే నేతన్నలకు కూడా రూ.5లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తయారుచేసిన డ్రాఫ్ట్ జీవో ఆర్టీనెం- 66 (డి27-04-2022) ను త్వరితగతిన అమలుచేయాలనీ, అందుకు అవసరమైన రూ.30 కోట్ల నిధులను వెంటనే ఎల్ఐసీ సంస్థకు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 360 మంది నేత కార్మికులు రకరకాల కారణాలతో మరణించారని తెలిపారు. ఆయా కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు, వితంతు మహిళలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, పెన్షను, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. త్వరలో ఈ సమస్యలను పరిష్కరిస్తామనీ, చేనేత బీమాను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.