Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్‌డీకి జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
డ్రైవర్, కండక్టర్లకు తక్షణం ప్రమోషన్లు ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం వినతిపత్రం సమర్పించారు. సంస్థలో 30 ఏండ్ల సర్వీసు పూర్తి చేసినా డ్రైవర్లు, కండక్టర్లు అదే హౌదాలో రిటైర్ అవుతున్నారని జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి తెలిపారు. అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారనీ, డ్రైవర్, కండక్టర్లకు మాత్రం పదోన్నతులు ఇవ్వట్లేదన్నారు. క్లాస్-2 సూపర్వైజర్ల నుంచి క్లాస్-1 అధికారుల వరకు ఖాళీలు ఏర్పడగానే ప్రమోషన్లతో భర్తీ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 120 మందికి డిపో మేనేజర్లుగా, 30 మందికి డివిజనల్ మేనేజర్లుగా, 20 మందికి రీజినల్ మేనేజర్లు, 10 మందికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారని వివరించారు. క్రిందిస్థాయి కేటగిరిల్లో మాత్రం ప్రమోషన్లు ఇవ్వట్లేదన్నారు. ఏడీసీ, కంట్రోలర్, లీడింగ్ హేండ్ తదితర విభాగాల కేటగిరిల్లోని ఖాళీలను పదోన్నతుల ద్వారా తక్షణం భర్తీ చేసేలా రీజినల్, వర్క్స్ మేనేజర్లకు ఆదేశాలు ఇవ్వాలని తమ వినతిపత్రంలో కోరారు. అలాగే ట్రాఫిక్, నిర్వహణ, నాన్ ఆపరేషనల్ యూనిట్స్, అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్‌తో పాటు సెక్యూరిటీ, తార్నాక ఆస్పత్రిలో పనిచేస్తున్న అర్హులైన సిబ్బందికి పీఆర్ కోటాలో పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.