Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధరల చట్టం, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పోరాటం
- ప్రెస్మీట్లో సంయుక్త కిసాన్‌మోర్చా నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస మద్దతు ధరల చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 31న హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్రోడ్తో పాటు రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో రాస్తారోకోలు చేయనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ప్రకటించారు. అగ్నిపథ్ పథకం వల్ల దేశానికే నష్టదాయకమని వారు తెలిపారు. అన్నదాతలకు, సైనికులకు మోడీ సర్కారు చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు ఆగస్టు ఏడో తేదీ నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా జైజవాన్-జైకిసాన్ పేరిట సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, రాయల చంద్రశేఖర్, జక్కుల వెంకటయ్య, నాయకులు మండల వెంకన్న, వస్కుల మట్టయ్య, మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రిప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎమ్ఎస్పీ చట్టంపై కమిటీ ఏర్పాటు విషయంపై మోసం చేసిందనీ, రైతులపై మోపిన తప్పుడు కేసులను ఇంకా ఎత్తివేయలేదని వివరించారు. నేడు దొడ్డి దారిన విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతులకు మోడీ సర్కారు చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ షహీద్ ఉద్దమ్ సింగ్ వర్థంతి రోజున దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిర్వహించే రాస్తారోకోలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం వల్ల సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. యూపీలోని అలహాబాద్‌లో రైతు నేత ఆశిష్ మిట్టల్‌పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తప్పుబట్టారు. బెంగాల్‌లోని ఫరక్కాలో అదానీ హైవోల్టేజీ వైర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై లాఠీచార్జినీ, ఛత్తీస్‌గఢ్‌లో నిరసన తెలిపిన రైతులపై అణచివేతను ఖండిస్తున్నామని తెలిపారు.