Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం తొలివిడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ కేటాయించింది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిసెట్‌లో 79,051 మంది ఉత్తీర్ణత పొందారనీ, 25,146 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. 118 కాలేజీల్లో 28,083 సీట్లున్నాయని తెలిపారు. తొలివిడతలో 20,695 (73.69 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 7,388 (26.31 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. 54 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 11,754 సీట్లుంటే, 10,778 (91.69 శాతం) మంది సీట్లు పొందారని తెలిపారు. కేవలం 976 (8.31 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఒక ఎయిడెడ్ కాలేజీలో 226 సీట్లుంటే 200 (88.49 శాతం) సీట్లు భర్తీ అయ్యాయనీ, 26 సీట్లు మిగిలాయని తెలిపారు. 63 ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 16,103 సీట్లుండగా, 9,717 (60.34 శాతం) సీట్లు కేటాయించామని వివరించారు. 6,386 (39.66 శాతం) సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 393 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 26 ప్రభుత్వ, ఐదు ప్రయివేటు కలిపి మొత్తం 31 పాలిటెక్నిక్ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని వివరించారు. 25 పాలిటెక్నిక్ కోర్సులుంటే, తొలివిడతలోనే ఎనిమిది కోర్సుల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు. అభ్యర్థులు వచ్చేనెల ఎనిమిది నుంచి పదో తేదీ వరకు జరిగే తుది విడత కౌన్సెలింగ్ తర్వాత కేటాయించిన కాలేజీల్లో చేరాలని అభ్యర్థులను కోరారు. వచ్చేనెల ఎనిమిది నుంచి పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని వివరించారు. ఎనిమిది నుంచి 16 వరకు విద్యార్థులకు ఓరియెంటేషన్ ఉంటుందని తెలిపారు. వచ్చేనెల 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.