Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితబంధు రాబంధులు: కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
- ఆగస్టు 7 నుంచి సంగారెడ్డిలో కేవీపీఎస్ రాష్ట్ర 3వ మహాసభ
నవతెలంగాణ-ఘట్కేసర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వెనుక రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దుచేసే కుట్ర ఉందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు రాబంధుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ కేవీఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం కేవీపీఎస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎం.కృపాసాగర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. అభివృద్ధిని పక్కన పెట్టి, మత రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విద్వేషాన్ని రగిలిస్తోందన్నారు. మాటల్లో దేశభక్తి, చేతల్లో దేశ విద్రోహ విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతూ కార్పొరేట్లకు మేలు చేస్తున్న బీజేపీ సర్కార్, పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం ఏమీ చేయకపోవగా ధరలు పెంచుతూ భారాలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను క్రమంగా సమాధి చేస్తోందన్నారు. రాజ్యాంగ మూల స్తంభాలను కూల్చే ప్రయత్నం చేస్తోం దన్నారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అసలైన లబ్దిదారులకు చేరడం లేదని, రాబంధుల పాలవుతోందని విమర్శించారు. దళితబంధు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం విశాల ఐక్య ఉద్యమం చేపడతామని చెప్పారు. కేవీపీఎస్ రాష్ట్ర 3వ మహాసభ ఆగస్టు 7వ తేదీ నుంచి 9 వరకు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. 7వ తేదీన నీలిదండు కవాతు, ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయని చెప్పారు. సభకు కేరళ దేవాదాయశాఖ మంత్రి, డీఎస్ఎంఎం జాతీయ అధ్యక్షులు కె.రాధాకృష్ణన్ ప్రధాన వక్తగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు హన్మకొండ ఆనంద్, సీఐటీయూ జిల్లా నాయకులు చంద్రశేఖర్, చింతల యాదయ్య, కోమటి రవి, ఎన్. సబిత, వెంకట్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.వినోద, ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సంతోష్, పట్నం జిల్లా నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.