Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభావంపై అధ్యయనం చేయాలి
- ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కారు లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై స్వతంత్ర సంస్థతో సమగ్రంగా అధ్యయనం చేయించాలని ఆ ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈమేరకు శనివారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి నిత్యం బ్యాక్‌వాటర్ ముప్పు ఉంటుందనీ, ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో తెలంగాణ ప్రాంతంలో నష్టం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. గోదావరికి ఇటీవల వచ్చిన వరదల వల్ల ఐదురోజులకు పైగా భద్రాచలం పరిసర ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయని గుర్తు చేశారు. పోలవరం వద్ద నీటి నిల్వతో గోదావరి నిండుగా ఉండటం వల్ల ముర్రేడు వాగు, కిన్నెరసాని, ఇతర నీటి వనరుల నుంచి వచ్చే నీరు పోటేయడం వల్ల పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాలను గుర్తించి వరద గ్రామాల్లోకి వరద రాకుండా కరకట్టలు నిర్మించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణ ప్రాంతంపై ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేసి ముంపును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు.