Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటక రంగం పేరిట సంస్థలకు భూముల లీజుపై సీఎస్‌కు ఎఫ్ఎఫ్జీజీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూములకు నామమాత్రపు అద్దెతో లీజుకు పొందిన సంస్థలు డబ్బులు చెల్లించడం లేదనీ, హైదరాబాద్ నగరంలో బకాయిపడ్డ 9 సంస్థల నుంచి రూ.271.74 కోట్లను వెంటనే వసూలు చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్ఎఫ్జీజీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఎఫ్ఎఫ్జీజీ కార్యదర్శి యం. పద్మనాభరెడ్డి లేఖ రాశారు. పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో హైదరాబాద్ నగరంలో 9 సంస్థలు భూములను లీజుకు తీసుకుని లాభాలు గడిస్తూ డబ్బులు చెల్లించడం లేదనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా తేలిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రకంగా శిల్పారామం వద్ద గల ట్రెడెంటల్ హోటల్, ప్రసాద్ ఐమ్యాక్స్, జలవిహార్ లాంటి సంస్థలు కోట్ల రూపాయలు బాకీ పడ్డాయని వివరించారు. ఆ సంస్థలకు పర్యాటక శాఖ కేవలం నోటీసులు పంపటం వరకే పరిమితమైందని పేర్కొన్నారు. బకాయిదారులకు రాజకీయ పలుకుబడి ఉండటం వల్లనే పర్యాటక శాఖ అంతగా పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులు కొన్ని ఉండవచ్చునని తెలిపారు. ఆయా సంస్థలు పర్యాటక శాఖకు బకాయిపడ్డ డబ్బులను వెంటనే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.