Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కొత్త మార్గదర్శకాలపై సదస్సులో ఇన్స్పెక్టర్ జనరల్(ఫారెస్ట్) జి.త్రినాథ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ పరిరక్షణ చట్టాలపై అధికారులు పూర్తి అవగాహన, పట్టు కలిగి ఉండాలని ఇన్స్పెక్టర్ జనరల్(ఫారెస్ట్) జి.త్రినాథ్ కుమార్ సూచించారు. అడవులను రక్షిస్తూనే, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అనుమతుల ప్రక్రియను చేపట్టాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అన్ని జిల్లాల అటవీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అటవీచట్టంలో కొత్తగా తెచ్చిన మార్పులుచేర్పులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అటవీ పరిరక్షణ చట్టం -1980 (ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్) కొత్త మార్గదర్శకాలు జూన్ 28 నుంచి అమల్లోకి వచ్చాయనీ, ఇకపై వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం అటవీ అనుమతుల ప్రక్రియ ఈ కొత్త నిబంధనల ప్రకారమే జరగాలని ఆదేశించారు. అటవీ భూముల మళ్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూనే, కఠిన నిబంధనలను కేంద్రం అమల్లోకి తెచ్చిందన్నారు.
తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్, చీఫ్ కన్జర్వేటర్, డీఎఫ్ఓ, నోడల్ అఫీసర్ సభ్యులుగా ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. సంబంధిత ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలకు అటవీ అనుమతుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
అటవీ భూముల మళ్లింపు కోరే యూజర్ ఏజెన్సీ (సంబంధిత శాఖ) వైపు నుంచి ప్రతిపాదనలు సరిగా ఉండేలా చూడాలన్నారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్), హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎం.డోబ్రియల్ మాట్లాడుతూ.. తాజా కేంద్రం నిబంధనల ప్రకారం జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) పాత్ర అటవీ అనుమతుల్లో మరింత కీలకం కాబోతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్(ఎఫ్సీఏ) ఎంసీ పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ ఏకే. సిన్హా, అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అన్ని జిల్లాల అటవీ అధికారులు పాల్గొన్నారు.