Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో అడుగంటిన విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు
- 1-5వ తరగతి విద్యార్థులకు సామర్థ్యాల పెంపునకు కార్యక్రమం
- ఉపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణ
- ఆగస్టు 15 నుంచి 'తొలిమెట్టు' పేరుతో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం
- నాస్ సర్వేలో 27వ స్థానంలో నిలిచిన తెలంగాణ స్టేట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా పరిస్థితుల వల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కనీస అభాస్యన సామర్థ్యాలు అడుగంటిపోయాయి. దీనికి నేషనల్ అచివ్మెంట్ సర్వే(న్యాస్) ఫలితాలే ఉదాహరణ. న్యాస్ ఫలితాల్లో దేశంలోనే తెలంగాణ 27వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యార్థుల పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుండటంతో విద్యావ్యవస్థలో ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) పేరుతో తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల్లో చదవడం, రాయడం, అభ్యాసన సామర్థ్యాలు సాధించే విధంగా మాతృభాషలో, ఇంగ్లీష్‌లో, గణితంలో, ఈవీఎస్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏడాదంతా అమలు చేసే ఈ కార్యక్రమంపై జిల్లా నోడల్ అధికారులకు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో శిక్షణ తీసుకోగా.. జిల్లా స్థాయిలోనూ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని 22 మండల కేంద్రాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ కొనసాగుతోంది. ఆగస్టు 15 నుంచి ప్రభుత్వ బడుల్లో 'తొలిమెట్టు'కు శ్రీకారం చుట్టనున్నారు.
వారంలో రెండ్రోజులు బడి సందర్శన
తొలిమెట్టు కార్యక్రమం పర్యవేక్షణకు మండల స్థాయిలో సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిని నోడల్ అధికారులుగా నియమించాలని డీఈవోలను విద్యాశాఖ ఆదేశించగా.. ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. వారంలో రెంకరడోజులు వారి మండలంలోని పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించాలి. మండల నోడల్ అధికారులు క్లస్టర్ అధికారులను సమన్వయం చేసుకుంటూ విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాలను పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అంతేగాక ప్రతి నెలా 27న హెచ్ఎంలు ఉపాధ్యాయులతో, 28న మండల విద్యాధికారులు హెచ్ఎంలతో, 29న మండల విద్యాధికారులు డీఈవోతో, 30న జిల్లా అధికారులు, డైరెక్టర్, సెక్రటరీ స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారు.
కొనసాగుతున్న శిక్షణ
తొలిమెట్టు కార్యక్రమం పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లాలో ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇస్తారు. ఈనెల 21, 22 తేదీల్లో 33జిల్లాల డీఈవోలు, ఆర్జేడీ, జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్స్‌కు తొలిమెట్టు ఎల్ఎఫ్ఎన్పై శిక్షణ పూర్తిచేశారు. 20 నుంచి 22 వరకు ఎస్ఆర్పీలు, డీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. 26 నుంచి 29 వరకు మండలాల ఆర్పీలకు మూడు రోజులపాటు శిక్షణ అందించారు. 29న మండల విద్యాధికారులు, డీఈవో, ఆర్జేడీ, సెక్టోరియల్ అధికారులు, డీఆర్పీ గ్రూప్‌లకు.. ఎసీఈఆర్టీ కో-ఆర్టినేటర్ ఆధ్వర్యంలో ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించి.. దిశానిర్దేశం చేశారు. శనివారం నుంచి రెండు దఫాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
పకడ్బందీగా అమలు..
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. గతంలో నిర్వహించిన కార్యక్రమాల లోపాలను అంచనా వేసుకుని ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలయ్యేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఐదు రోజులపాటు విద్యార్థులకు బోధించి అనంతరం పరీక్షలు నిర్వహిస్తారు. పాఠ్యాంశాల బోధనకు ముందు సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమ అమలుకు ఎస్ఎంసీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల విద్యాధికారులు, గెజిటెడ్ హెచ్ఎంలు నోడల్ అధికారులుగా ఉండి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో డీఈవో, సెక్టోరియల్ అధికారులు, ఎన్సీఆర్టీ అధికారులతో మానిటరింగ్ బృందాల పర్యవేక్షణ ఉంటుంది.
పర్యవేక్షణ లేక.. ఫలితాలు అంతంతే..!
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు విద్యాశాఖ గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. కరోనాకు ముందు ప్రభుత్వ బడుల్లో త్రీ ఆర్స్ పద్ధతి, అటైన్మెంటు ఆఫ్ బేసిక్ కాంపిటెన్సిస్(ఏబీసీ) పేరుతో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు కోసం కృషి చేశారు. కానీ వీటిద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయారు. సరియైన పర్యవేక్షణ లేకపోవడంతోపాటు అధికారుల సమీక్షలు వంటివి లేకపోవడమేనని విద్యాశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు మాత్రం విస్తృత మార్గాల్లో వివిధ వర్గాలను సమన్వయపర్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకు రూమ్ టు రేడి, టీచ్ ఫర్ ఇండియా మొదలగు స్వచ్చంధ సంస్థలు తొడ్పాటునందిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లాలోని ఉపాధ్యాయుల ఖాళీల కారణంగా విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు సాధ్యమేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ జిల్లాలో విద్యాశాఖకు 5962 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా.. 5వేల మంది పనిచేస్తుండగా.. 900 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండగా.. కీలకమైన సెక్టోరియల్ అధికారులను సైతం నియమించడంలేదు. 691 సర్కారు బడుల్లో 1.17503 మంది చదువుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'తొలిమెట్టు' ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని ఎలా ముందుక తీసుకెళ్తారన్న అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.