Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఉద్యమకారులు లేరు
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మెన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. శనివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉద్యమకారులు ఎవరూ లేరన్నారు. టీఆర్ఎస్తో నా 22 ఏండ్ల చరిత్రకు నేటితో ముగింపు పలికినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మెదక్ జిల్లా ఇన్చార్జిగా, గజ్వేల్ ఇన్చార్జిగా పనిచేశానన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్సీ ఇస్తానని, రాజ్యసభకు పంపుతామన్నారని, ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో తనకు తెలియదన్నారు. టీఆర్ఎస్లో నేడు ఆత్మగౌరవం లేదన్నారు. టీఆర్ఎస్లో మనకు బాధ మిగులుతుంది తప్ప అక్కడ భవిష్యత్ లేదని సహచరులకు హితవుపలికారు. తలదించుకొని బతకడం అవసరం, కానీ కాళ్లు మొక్కి బతకడం తనకు అవసరం లేదన్నారు. కేసీఆర్ ఇంటి నుంచి ముగ్గురు మంత్రులున్నారని, వారికేమి బాధ ఉంటుందని ప్రశ్నించారు. ప్రాణం వున్నా లేకున్నా ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఉద్యమకారులంతా ఒక తాటిపైకి రావాలన్నారు. ఏ పార్టీలో చేరేది భవిష్యత్తులో చెబుతానన్నారు.