Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటారు
- ఒక్క ప్రాజెక్టు కోసం రాష్ట్ర ఆదాయాన్ని ధారపోశారు
- వరద ముంపుపై చర్చిద్దాం... అసెంబ్లీని సమావేశపరచండి : భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరంలో మునిగిన మోటర్లు పని చేస్తాయా? లేదా? లిఫ్ట్ పని చేసే పరిస్థితి ఉందా? తదితర అంశాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం అక్కడికి పోతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిబ్బందిని కూడా అక్కడికి వెళ్లనివ్వకపోవడంతో అనేక అనుమానాలున్నాయని పేర్కొన్నారు. అక్కడ దాగి ఉన్న రహస్యాలేంటో పరిశీలిస్తామన్నారు. మొత్తం రాష్ట్ర ఆదాయాన్ని ధార పోసి నిర్మించిన ఆ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకూ నీరు అందలేదని చెప్పారు. శనివారం అసెంబ్లీ మీడియాపాయింట్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 18లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ఆదాయాన్ని, సంపదను, చేసిన అప్పుల మొత్తాన్ని ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు ఇవ్వలేదని విమర్శించారు. గోదావరి వరదలకు కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లు మునిగి, రక్షణ గోడలు కూలి నేడు నిరుపయోగంగా మారడంతో ప్రజలసంపద నీళ్ల పాలయ్యిందని మండిపడ్డారు. మోటర్లు మునగడం, రక్షణ గోడలు కూలడం కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరద నీటిలో మునిగిపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపులు ఇక పనిచేస్తాయా? లేదా? ఎంత మేరకు నష్టం జరిగింది? నష్టానికి కారణాలేంటనే దానిపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు
రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉంటే, సీఎం కేేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని భట్టి ఈసందర్భంగా ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పరిపాలన సాగుతుందా? అని నిలదీశారు. మంత్రి కేటీఆర్ కాలుకు గాయమై విశ్రాంతి తీసుకుంటున్నారనీ, మిగతా మంత్రులు రాష్ట్రంలో మాట్లాడే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునక, వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీ సమావేశపరచాలని డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారనీ, ఆయనతో తాను, పార్టీ అధిష్టానం కూడా మాట్లాడుతుందన్నారని వివరించారు. ఆయనకు ఉన్న ఇబ్బందిని తెలుసుకుని పరిష్కరించడం ద్వారా సాధ్యమైనంత వరకు ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోనే ఉండేలా చూస్తామని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డితో ఉత్తమ్ భేటీ
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడనున్నారనే నేపథ్యంలో పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి వేర్వేరుగా శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో ఉండాలని కోరినట్టు తెలిపారు. అధిష్టానం సూచనమేరకు ఢిల్లీకి రావాలని సూచించారు.