Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
- అర్ధనగంగా నిరసన ప్రదర్శన
- రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు
- ఆసిఫాబాద్ జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ- విలేకరులు
పేస్కేల్ అమలు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారం రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆందోళనలో భాగంగా శనివారం వీఆర్ఏలు వినూత్న పద్ధతుల్లో నిరసన తెలిపారు. అర్ధనగంగా ప్రదర్శన నిర్వహించారు. వారికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మరికొన్ని చోట్ల అధికారులూ సంఘీభావం తెలిపారు.
ఖమ్మం జిల్లా కూసుమంచిలో వీఆర్ఏలు అర్ధనగ ప్రదర్శన చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అర్ధనగంగా ప్రదర్శన నిర్వహించారు. ఎర్రుపాలెంలో తహసీల్దార్, ఎంపీడీవో సంఘీభావం తెలిపారు. కల్లూరులో ఐఎఫ్టీయూ నాయకులు సంఘీభావ తెలిపారు. కామేపల్లిలో వీఆర్వోలు, పెనుబల్లిలో కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మణుగూరులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. దుమ్ముగూడెంలో ప్రజాపంథా పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కె దాదేమియా సందర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్లో వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడాం గణపతి సందర్శించి మద్దతు తెలిపారు. అక్కడే సమ్మెలో ఉన్న వీఆర్ఏ ఓండ్రె తిరుపతి ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుందో లేదోనని ఆందోళన చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తోటి వీఆర్ఏలు వెంటనే అతడిని అడ్డుకున్నారు. కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు చేపడుతున్న వీఆర్ఏల సమ్మె శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జయదేవ్ అబ్రహం, శివప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఖానాపూర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు గులాబీ పూలు తహసీల్దార్‌కు ఇచ్చి మద్దతు తెలుపాలని కోరారు. వీఆర్ఏలకు అంగన్వాడి కార్యకర్తలు మద్దతు తెలిపారు. తాండూర్ మండల కేంద్రంలో వీఆర్ఏలు పిల్లాపాపలతో సమ్మెలో పాల్గొన్నారు. దండేపల్లిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు అర్ధనగ ప్రదర్శన చేపట్టారు.