Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గీతం పట్టభద్రులకు సీసీఎంబీ డెరైక్టర్ సూచన
- ఘనంగా గీతం 13వ స్నాతకోత్సవం
నవతెలంగాణ-పటాన్చెరు
'మన ప్రయత్నాల వల్లే విజయం సాధించామని భావిస్తాం. వైఫల్యాలను మాత్రం వేరొకరి తప్పిదంగా ఆపాదిస్తాం. మీ వెఫల్యాలను అంగీకరించి, వాటి నుంచి గుణపాఠాలను నేర్చుకుని స్థితప్రజ్ఞతను ప్రదర్శించాలి' అని సీసీఎంబీ డెరెక్టర్ డాక్టర్ వినరు కె.నందికూరి విద్యార్థులకు ఉద్బోధించారు. హైదరా బాద్‌లో శనివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటకలో జన్మించిన తాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా పల్లెల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, విశాఖలో బీఎస్సీ, ఐఐటీ బాంబేలో పీహెచ్డీ, అమెరికాలో ఉద్యోగ జీవితం.. 18ఏండ్ల కిందట స్వదేశానికి తిరిగొచ్చిన వైనాన్ని వివరించారు. తన 24 ఏండ్ల ప్రయాణంలో మంచి చెడులు, ఆశ-నిరాశలు, ఎత్తు పల్లాలను చూసినట్టు చెప్పారు. నేర్చుకోవడం, పరీక్షలు రాయడానికి భిన్నంగా పీహెచ్డీ అధ్యయనం ఉంటుందన్నారు. మార్గదర్శనమే కీలక భూమిక పోషిస్తుందన్నారు. మన సామర్థ్యాలను ఎంచే పరీక్షలతో నిమిత్తం లేకుండా, పరిశోధన స్వీయ సంకల్పం, కృషి, ఆశయాలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎత్తు పల్లాల్లో, మంచి చెడులలో మనకంటూ మంచి మిత్రుల సాయం అవసరమవుతుందన్నారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో విద్యారంగం చాలా సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. దాదాపు 200 యూజీ, పీజీ, డాక్టరల్ కోర్సులు, 23,500 మంది రెగ్యులర్ విద్యార్థులు, 2,180 మంది పరిశోధకులకు, 1,500 మంది అధ్యాపకులతో విద్యను అంది స్తున్నట్టు గీతం ప్రోవీసీ (అకడమిక్స్) ప్రొఫెసర్ జయశంకర్ ఇ.వారియర్ వార్షిక నివేదికలో పేర్కొ న్నారు. డిజిటల్, మిశ్రమ అభ్యాసాన్ని అమలు చేయ డం ద్వారా విద్యార్థి కేంద్రీకృత అభ్యాసాన్ని తప్ప నిసరి చేసినట్టు తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసినందుకుగాను ప్రొఫెసర్ శాంతా సిన్హాకు, తెలుగు సాహిత్య ఔన్నత్యానికి విశేష కృషిచేసిన ప్రఖ్యాత తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్‌కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ఇచ్చి సత్కరిం చారు. గీతం హైదరాబాద్ ప్రాంగణంలో 1,346 మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్ వంటి వివిధ విభాగాలలో డిగ్రీలు పొందడానికి అర్హత సాధించగా, 1,133 మంది విద్యార్థులు, 35 మంది పరిశోధకులు పట్టాలను స్వీకరించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకున్నారు. గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖరన్ వందన సమర్పణ చేశారు.గీతం కులపతి డాక్టర్ వీరేందర్‌సింగ్ చౌహాన్, ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్దవటం, గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం వైద్య కళాశాల ప్రోవీసీ డాక్టర్ గీతాంజలి బత్మనాబానే, గీతం బెంగళూరు ప్రొవీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.మోహన్‌కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.గుణశేఖర్, డీన్లు ప్రొఫెసర్ అమిత్ భద్రా, సయ్యద్ అక్బరుద్దీన్, ప్రొఫెసర్ పి.రామారావు, ప్రొఫెసర్ సి.విజయశేఖర్, గీతం కార్యదర్శి ఎం.భరద్వాజ, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ పాల్గొన్నారు.