Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఈనెల 25న ఢిల్లీ వెళ్లిన ఆయన వారం రోజులు అక్కడే మకాం వేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి, విదేశాలు క్లౌడ్ బరస్ట్ చేస్తుండొచ్చు అని ఓ సందేహాన్ని ప్రజల్లో రేకెత్తించి, డిల్లీకి వెళ్లి పోయారు. ఆయన అక్కడకు ఎందుకు వెళ్లారనే దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఈ వారం రోజులూ ఆయన మీడియాకు దూరంగానే ఉన్నారు. అడపాదడపా సీఎం కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అక్కడి నుంచే తెలుగు మీడియాకు సీఎం దానిపై రివ్యూ చేశారు. దీనిపై స్పందించారు అంటూ లీకుల ప్రకటనలు వాట్సప్ల ద్వారా పంపి, పత్రికల్లో ప్రచురితమయ్యేలా కృషి చేశారు. ముఖ్యమంత్రి హౌదాలోనే ఢిల్లీకి వెళ్ళిన ఆయన అంత గోప్యంగా ఎందుకుండిపోయారనే సందేహం ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ నిలిచిపోయింది. ఓవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే, సీఎం ఢిల్లీకి ఎందుకెళ్లారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయినా టీఆర్ఎస్ శ్రేణులు ఈ విమర్శల్ని పెద్దగా పట్టించుకోలేదు. ''ఆయన ఇక్కడ ఉండీ చేసేదేముంది?'' అని ప్రజలూ సర్దిచెప్పుకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ''పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై అంతకుముందే ఆయన దిశానిర్దేశం చేశారు. దానికోసం ఆయన ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. అప్పుల కోసం వెళ్లారనే ప్రచారంలోనూ వాస్తవికత లేదు. అక్కడికెళ్లి ఏ సమస్యలు పరిష్కరించుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా!'' అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సెప్టెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పెద్దలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం మూడ్ను కూడా తెలుసుకొనేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన అధికారులను ఎవర్నీ కలవలేదు. 75 వసంతాల స్వాతంత్య్ర ద్విసప్తాహ ఉత్సవాల నిర్వహణ కోసం రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నేతృత్వంలో వేసిన కమిటీతో ఆగస్టు 2వ తేదీ భేటీ అయ్యి దిశానిర్దేశం చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది. అంతకు మించి ఆయన ఢిల్లీ పర్యటన విషయాలు ఏవీ ప్రస్తావనకు రాలేదు.