Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాబితా ప్యూరిఫికేషన్ పేరుతో కసరత్తు
- స్వచ్ఛందంగా అంటూనే ఇంటింటి సర్వే
- జీహెచ్ఎంసీ రెడీ
- రాజకీయ పార్టీల అభ్యంతరం
- ఏడాదికి నాలుగు సార్లు ఓటరు నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ లింకు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. నేటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. అయితే 2015లోనూ నగరంలో ఓటరు గుర్తింపుకార్డులకు ఆధార్ లింక్ చేశారు. కానీ రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు మరోసారి ఆధార్ లింకు అంశం తెరపైకి వచ్చింది.
శుద్ధిపేరుతో..
ఓటర్ల జాబితాల శుద్ధీకరణ పేరుతో ఆధార్ కార్డును లింకు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అందుకోసం ఆధార్‌ను ఉపయోగించడం కోసం ప్రజాప్రాతినిధ్య చట్టం1950కి సవరణలు కూడా చేసింది. ఆ సవరణ ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఫారం-6 బీ ప్రకారం ఆధార్ నెంబర్ సమాచారం నేటి నుంచి ఓటరు జాబితాలో ప్రామాణీకరణ చేయనున్నారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతి వ్యక్తి తన ఆధార్ నెంబర్‌ను ఫారం-6బీలో ఓటరు నమోదు అధికారులకు స్వచ్ఛందంగా తెలియజేయాలని నిర్ణయించారు. దరఖాస్తుదారులు ఫారం-6బీని ఆధార్‌కార్డ్‌తో పాటు సమర్పించాలి. స్వచ్ఛందంగానే అన్లైన్ ద్వారా నమోదు చేయడానికి అవకాశముంది. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు అవసరమైన ధృవీకరణ పత్రాలతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్ఓ)కు అందజేయాలి. ఆ దరఖాస్తును బూత్‌స్థాయి అధికారి(బీఎల్ఓ) పరిశీలించనున్నారు. ఓటర్లు సమర్పించిన ఆధార్ వివరాలు డిజిటలైజ్ చేయనున్నారు. డబుల్ లాకింగ్ సిస్టమ్ ద్వారా ఈఆర్ఓలు సురక్షితంగా, గోప్యంగా ఉంచనున్నట్టు చెబుతున్నారు. ఆధార్‌నెంబర్ అందుబాటులోలేని పక్షంలో దరఖాస్తుదారుడు మరో 11 ప్రత్యామ్నాయ
పత్రాలలో దేనినైనా సమర్పించాలని నిర్ణయించారు. వాటిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాబ్ కార్డ్, బ్యాంక్/పోస్టాఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్‌బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డ్, ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, భారతీయ పాస్‌పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పీఎస్‌యూ/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఉద్యోగికి జారీ చేయబడిన ఫోటోతో కూడిన సర్వీస్ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడిన ప్రత్యేక గుర్తింపుకార్డులను అందజేయాలని అధికారులు సూచించారు.
ఏడాదికి నాలుగు సార్లు...
ఓటరు గుర్తింపు కార్డుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంతకు ముందు ఒక్కసారి నమోదు చేసుకుంటే సరిపోతుందని అనుకునేవారు. కానీ ఇక నుంచి ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా సవరించింది. ఓటరు నమోదు ఏడాదిలో వివిధ అర్హత తేదీలను నిర్దేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ఓటర్ల నమోదు నియమాలు, 1960 చట్టం సవరణలు చేసిన నేపథ్యంలో ఏడాదిలో మూడు నెలలకోసారి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై1, అక్టోబర్1 నాటికి 18 ఏండ్ల వయస్సు నిండిన వారందరూ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
స్పెషల్ సమ్మరి -2023
భారత ఎన్నికల కమిషన్ జనవరి 1 తేదీ, ఏప్రిల్ 1 తేదీ, జూలై 1 తేదీ, అక్టోబర్ 1 తేదీల నాటికి 18 సంవత్సరాలు నిండిన అర్హత తేదీని సూచిస్తూ ఆర్పీ చట్టం1950లోని సెక్షన్ 14 (బి)కి సవరణను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా సవరించిన ఫారమ్‌లు https://nvsp.in వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అంతే కాకుండా నేటి నుంచి జీహెచ్ఎంసీ వెబ్సైట్ ghmc.gov.inలో కొత్తగా సవరించిన ఫామ్‌లను అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ఓటర్లందరూ తమ ఆధార్ వివరాలు, ఫారం 6బీలో సూచించిన 11 పత్రాలలో ఏదైనా ఒకదాన్ని అందించాలని, క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సవరించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8లో అవసరమైన ధృవీకరణ పత్రాలను జతచేసి పూర్తి వివరాలతో భర్తీ చేసిన దరఖాస్తును అందజేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ కోరారు.