Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వేతనాల జీవోలు సవరించాలి
- సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోలను సవరించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆదివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయని తెలిపారు. వాటిలో సుమారు కోటి మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు. ఐదేండ్లకోసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల సలహా మండలి సిఫారసుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు గడిచినా ఒక్కసారి కూడా సవరించలేదని విమర్శించారు. గతేడాది జూన్‌లో ఐదు జీవోలను విడుదల చేసినా కానీ వాటిని గెజిట్ చేయలేదని పేర్కొన్నారు. వాటికి గెజిట్ చేయాలనీ, మిగిలిన 68 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు. బీడీ, హమాలీ, భవన నిర్మాణ, రవాణా రంగాల కార్మికులతోపాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు, క్యాజువల్, తాత్కాలిక పద్ధతుల్లో కార్మికులతో యాజమాన్యాలు రోజుకు 12 గంటలు పని చేయిస్తున్నాయని తెలిపారు. కనీస వేతనం నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక కంపెనీల్లో పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవులు వంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడం లేదని విమర్శించారు.
సెజ్‌ల్లో అమలు కాని కార్మిక చట్టాలు
స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్‌ల) పేరిట ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కార్మిక చట్టాలు అమలు చేయకుండా, యూనియన్లు పెట్టుకోకుండా అడ్డుకుంటున్నారని తమ్మినేని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని తెలిపారు. పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆస్పత్రుల్లేవని పేర్కొన్నారు. అవి ఉన్నా సిబ్బంది, మందుల కొరతతో సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు. బీహార్, యూపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పెద్దసంఖ్యలో ఈ రాష్ట్రంలో పని చేస్తున్నారని వివరించారు. వారి పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తెలిపారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కనీస వేతనాలు మూడుసార్లు సవరణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కార్మిక సంఘాల ఒత్తిడి, హైకోర్టు ఆదేశం మేరకు కనీస వేతనాల సలహా మండలిని 2014లో ఏర్పాటు చేశారని తెలిపారు. కాలపరిమితి ముగిసిన జీవోలను సవరించాలనీ, కనీస వేతనాల సలహా మండలి ప్రతిపాదన పంపిందని పేర్కొన్నారు. 2015 నుంచి నేటి వరకు ప్రభుత్వం వాటిని ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు.
ట్రాన్స్‌పోర్టు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ట్రాన్స్‌పోర్టు రంగంలో సుమారు 16 లక్షలు మంది ఉన్నారని తమ్మినేని తెలిపారు. వారికి సంబంధించిన జీవోనెంబర్ 25ను గెజిట్ చేయాలని కోరారు. వారి కోసం సంక్షేమ బోర్డునూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో సుమారు 20 లక్షల మంది ఉంటారని పేర్కొన్నారు. సంక్షేమ బోర్డులో 14 లక్షల మంది నమోదు చేసుకున్నప్పటికీ ఎనిమిది లక్షల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారని తెలిపారు. కార్మికులందరినీ బోర్డులో నమోదు చేయాలని సూచించారు. అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు లక్ష బైక్‌లు ఇస్తామంటూ హామీఇచ్చి నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. లోడింగ్-అన్లోడింగ్, ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే హమాలీ కార్మికులు ఐదు లక్షల మందికి ఎలాంటి చట్టపరమైన భద్రత లేదనీ, వారికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ్మినేని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణలో బీడీ పరిశ్రమ కీలకమైందని వివరించారు. ఆ రంగంలో సుమారు ఏడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. 2012లో జీవోనెంబర్ 41 ప్రకారం వేతనాలు పెంచి మళ్లీ దాన్ని నిలిపివేశారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా ఆ జీవోను పునరుద్ధరించలేదని తెలిపారు. లేదంటే కనీస వేతనాలను పెంచుతూ మరో జీవోనూ విడుదల చేయలేదని విమర్శించా రు.రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఎనిమిదేండ్లుగా పెంచకపోవడ ం చాలా శోచనీయమని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. కోటి మంది కార్మికుల ప్రయోజనాల కోసం కనీస వేతనాలను సవరించాలని కోరారు.