Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుల్‌ఐటీ బాసర సమస్యలను వెంటనే పరిష్కరించాలి
- వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్రిపుల్‌ఐటీ బాసరలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడం పనికి మాలిన చర్య అని వామపక్ష విద్యార్థి సంఘాలు విమర్శించాయి. విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్ట్ చేయటం అప్రజాస్వామిక చర్య అని తెలిపాయి. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు రావి శివరామకృష్ణ (ఏఐఎస్ఎఫ్), టి నాగరాజు (ఎస్ఎఫ్ఐ), బోయినపల్లి రాము (పీడీఎస్‌యూ), పరుశురాము (పీడీఎస్‌యూ), గంగాధర్ (ఏఐడీఎస్వో), పి మహేష్ (పీడీఎస్‌యూ) సంయుక్తంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాణ్యత పాటించని మెస్ కాంట్రాక్టర్లను తొలగించాలంటూ శనివారం రాత్రి నుంచి తిండి మానేసి త్రిపుల్‌ఐటీ బాసర విద్యార్థులు శాంతియుతంగా క్యాంపస్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిరసనలో పాల్గొన్న విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వర్సిటీ నుంచి బర్తరఫ్ చేస్తామని హెచ్చరించటం సహేతుకం కాదని పేర్కొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వారి తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుద్దామనీ, వారి ఇంటికి వెళ్తే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వారిని విడుదల చేయాలనీ, బాసర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని గతంలో కలుషితమైన ఆహారం అందించిన మెస్ కాంట్రాక్టర్‌ను వెంటనే తొలగించి కొత్త టెండర్లు పిలవాలని కోరారు. శాశ్వత ప్రాతిపదికన వీసీని నియమించి, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండేలా అధునాతన లైబ్రరీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్రిపుల్‌ఐటీ బాసర విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఉద్యమాలను అనాలోచిత తప్పడు నిర్ణయాలతో అడ్డుకోవాలని చూడటం సమంజసం కాదని తెలిపారు. సోమవారం నుంచి జరిగే పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా పాల్గొంటామని హెచ్చరించారు.