Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాఠీచార్జి, అరెస్టులను ఖండిస్తున్నాం : ఐఏడబ్ల్యూయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికారాబాద్ జిల్లా పరిగిలో పేదల గుడిసెలను పోలీసులు తగులబెట్టడం అత్యంత దుర్మార్గమనీ, వందలమంది పేదలపై లాఠీచార్జి చేసి అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్, బి.వెంకట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు ప్రకటనలు విడుదల చేశారు. ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్లోని సర్వే నెంబర్ 18లోని 9.39 గుంటల ప్రభుత్వ స్థలంలో కనీసం గూడు లేని పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారని తెలిపారు. రెండేండ్లుగా భూమి, ఇండ్ల స్థలాల కోసం స్థానిక అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఆందోళనలు సాగించినా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతోనే పేదలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారని తెలిపారు. ఆ పేదలపట్ల రాష్ట్ర సర్కారు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. తక్షణమే కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ జోక్యం చేసుకుని గుడిసెవాసులందరికీ వెంటనే పట్టాలిచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన పేదలను, నాయకులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.