Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మోడల్ కానిస్టేబుల్ పరీక్షకు మంచి స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 17 కేంద్రాల్లో 2,150 మంది అభ్యర్థులు రాశారు. ఆదివారం హైదరాబాద్లోని చిక్కడపల్లిలో న్యూఎరా జూనియర్ కళాశాలలో డీవైఎఫ్ఐ మోడల్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, న్యూఎరా కళాశాల డైరెక్టర్ శ్రావణ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం డీవైఎఫ్ఐ నిరంతరం పోరాడుతున్నదని చెప్పారు. పోరాటంతోపాటు నిరుద్యోగుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ ఈ పరీక్షకు మంచి స్పందన వచ్చిందన్నారు. దేశంలో యువతీ, యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువతను చైతన్యవంతం చేస్తున్నామన్నారు. ఒకవైపు పోరాటాలు నిర్వహిస్తూ, మరోవైపు సేవాకార్యక్రమాలు, క్రీడాపోటీలతోపాటు యువతలో ఉన్న ప్రతిభను వెలికితీయడం కోసం మోడల్ టెస్టులను నిర్వహిస్తున్నామని అన్నారు. డీవైఎఫ్ఐ నిర్వహించే ఈ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎమ్డీ జావీద్, జిల్లా ఉపాధ్యక్షులు శృతి, నాయకులు శ్రీమాన్, వేణు, ప్రశాంత్, జలంధర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్ తదితరులు పాల్గొన్నారు.