Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయుఎంహెచ్ఈయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి, ఇతర అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల మూడున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదా నాయక్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్, వైద్య విద్య, ఇతర విభాగాల్లో శానిటేషన్, స్వీపర్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, దోభీ తదితర పనులు చేస్తున్నారని తెలిపారు. దశాబ్దాల తరబడి కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారనీ, ఎనిమిదేండ్లుగా వేతనాలు పెంచకపోవడం వల్ల దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, వీరందరి సమస్యలు పరిష్కరించాలంటూ గతంలో దశల వారీగా ఆందోళన పోరాటాలు, సమ్మెలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఫలితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాకపోవడం అన్యాయమని విమర్శించారు. హామీలను నిలబెట్టుకొని కనీస వేతనాలు అమలు చేస్తూ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు మారిన కూడా కార్మికులను మార్చకుండా అన్ని ఆస్పత్రుల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలనీ, సెలవులు, యూనిఫాం, రక్షణ పరికరాలు ఇవ్వాలనీ, విధి నిర్వహణలో రోజువారీ సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల మూడున బుధవారం రోజున ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్కు వరకు ప్రదర్శన, ధర్నాచౌక్ వద్ద మహాధర్నా ఉంటుందని తెలిపారు.ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు తప్పకుండా హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు.