Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబిత ఇంటి ముట్టడి.. అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ త్రిపుల్ఐటీ బాసరకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆదివారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు త్రిపుల్ఐటీ బాసర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తమ తోబుట్టువుగా భావించి సబితా ఇంద్రారెడ్డికి సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని చెప్పారు. విద్యార్థులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను తక్షణమే తీర్చాలనీ, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంత్రిని కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలను విన్నవించాలని భావిస్తే అక్రమంగా పోలీసులతో అరెస్టు చేయించడాన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు, ఎన్ఎస్యూఐ ఖండించాయి. విషయం తెలుసుకున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. త్రిపుల్ఐటీ విద్యార్థుల సమస్యలను తీర్చే వరకూ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.