Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షిత కౌలుదారు చట్టం అమలు చేయాలి
- అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-యాచారం
70 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న రైతులకు రక్షిత కౌలుదారు చట్టం ప్రకారం ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని అఖిలభారత రైతు సంఘం ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి, సింగారం, కురుమిద్ద, తాడిపర్తి గ్రామాల్లో తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. నందివనపర్తి ఓంకారేశ్వర ఆలయం పేరు మీద ఉన్న భూమిలో సాగు చేసుకుంటున్న రైతులతో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాలుగు గ్రామాల బాధిత రైతులు 234 ఎకరాలు సాగు చేసుకుంటున్నారన్నారు. 70 ఏండ్ల నుంచి 1,534 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఉందని, ఇందులో 300 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 234 ఎకరాల్లో రైతులు కౌలు చెల్లించి సాగు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. 1950లో ఆర్టికల్ 37/ఏ, 38.. ఆనాడు రక్షిత కౌలుదారు చట్టం కింద ఈ భూములపై రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చారని తెలియజేశారు. అయితే, బాధిత రైతులు 20 ఏండ్ల నుంచి కౌలు చెల్లించి సాగు చేసుకుంటున్నారన్నారు. కాగా, ఈ భూమి ఓంకారేశ్వర ఆలయం పేరు మీద ఉందన్న ఆధారాలు ఎక్కడా లేవని తెలిపారు. ఈ భూ వివరాల కోసం ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. రక్షిత కౌలుదారు రైతులకు చెందాల్సిన భూమి అని ప్రభుత్వం వెల్లడించిందన్నారు. 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఈ భూమిపై రైతుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. చట్టపరంగా రైతులకు చెందాల్సిన భూమిని ఫార్మాసిటీకి లేదా వేరొక కంపెనీకి ప్రభుత్వం అప్పగించాలని చూస్తే రైతుల నుంచి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే గ్రామాల నుంచి హైదరాబాద్కు పాదయాత్రగా వచ్చి కలెక్టర్కు మెమోరండం అందజేస్తామని తెలిపారు. ఇప్పటికైనా ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్యాబినెట్ సమావేశం నిర్వహించి రైతులకు పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య, సర్పంచులు దోస రమేష్, ఉప సర్పంచ్ నరసింహ, నాలుగు గ్రామాల బాధిత కౌలు రైతులు పాల్గొన్నారు.