Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాధవరెడ్డి, సంపత్ లతో పాటు మరో ఇద్దరినీ ప్రశ్నించనున్న దర్యాప్తు సంస్థ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్లాది రూపాయల క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌తో ఐదుగురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో విచారణ సాగనున్నది. నేపాల్‌లోని ఒక స్టార్ హోటల్లో కోట్ల రూపాయాల్లో క్యాసినోను నిర్వహించిన ప్రవీణ్ అందుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను హవాలా రూపంలో సాగించినట్టు ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా తేల్చిన విషయం విదితమే. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రవీణ్‌తో పాటు ఆయన అనుచరుడు మాధవరెడ్డి ఆస్థులపై సోదాలనూ నిర్వహించింది. ముఖ్యంగా, నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు పలువురు వ్యాపారులు, ప్రజా ప్రతినిధులను ప్రత్యేక విమానంలో తరలించినట్టు ప్రవీణ్‌పై ఆరోపణలున్నాయి. ముఖ్యంగా, క్యాసినో నిర్వహణకు వాడిన భారీ మొత్తంలో డబ్బులను హవాలా రూపంలో తరలించినట్టు ప్రవీణ్‌ను ఈడీ అనుమానిస్తున్నది.ఈ విధంగా నేపాల్‌లోనే కాక ఇండోనేషియా, థారులాండ్, శ్రీలంకలలో కూడా క్యాసినో నిర్వహించి హవాలా రూపంలోనే భారీగా ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు ఈడీ తన దర్యాప్తులో ప్రాథమికంగా అనుమానిస్తున్నది. ఈ మేరకు కేసును నమోదు చేసిన ఈడీ అధికారులు బాధ్యులుగా భావిస్తున్న ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి, సంపత్తో పాటు మరో ఇద్దరిని సోమవారం నుంచి విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు విచారణ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగే అవకాశమున్నదని తెలిసింది. ఇందుకు సంబంధించి విచారణ కోసం ప్రత్యేక టీమ్‌లను ఈడీ ఏర్పాటు చేసినట్టు సమాచారం.