Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాలు : ఎన్పీఆర్డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులివ్వాలని వికలాంగుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం వెంకట్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. వికలాంగులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారనీ, వారి సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో 20లక్షల మంది వికలాంగులు ఉన్నారనీ, వీరిలో కేవలం 4.83లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తున్నారని తెలిపారు. 2018 నుంచి ఒక్కరికి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న 3.51లక్షల ఆసరా పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల కాలంలో 12లక్షల ఆసరా పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. తక్షణమే అర్హులైన వారి పింఛన్లను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిల్ ఎర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. 21రకాల వైకల్యాల వారికి వైకల్య ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి ఆరేండ్లవుతున్నా దాన్ని అమలు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులని 2016 ఆర్పీడీ చట్టం చెపుతుంటే.. రాష్ట్రంలో ఆర్టీసీ అధికారులు మాత్రం బధిరులు, మానసిక వికలాంగులు, అంధులకు 100శాతం వైకల్యం ఉంటేనే రాయితీ బస్ పాసులు ఇస్తామని చెప్పడమేంటని ప్రశ్నించారు. షరతులు లేకుండా వికలాంగులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో రైల్వే ఆన్లైన్ పాసుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి అర్ వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్కొని రాజు, టి మధుబాబు, ఆరిఫా, సహాయ కార్యదర్శులు వి ఉపేందర్, జే దశరథ్, కవిత, సభ్యులు శశికళ, సావిత్రి, సురపంగ ప్రకాష్, బి స్వామి,కషప్పా, భుజంగ రెడ్డి, కోట్ల గౌతమ్, ఎర్పుల జంగయ్య, వీరబోయిన వెంకన్న, గంగారాం, లలిత పాల్గొన్నారు.