Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరదలతో నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వని సర్కార్
- పంట నష్టాన్ని ఎందుకు అంచనా వేయడం లేదు?
- పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న టీఆర్ఎస్
- పంట నష్టపరిహారం వెంటనే ప్రకటించాలి :
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోదావరి వరద ముంపుతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో అప్పుల పాలై రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల గోదావరికి వరదలు పోటెత్తడంతో తెలంగాణలో సుమారుగా 13 లక్షల ఎకరాలకు పైగా పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. పంట నష్టం జరిగిన రైతులకు భరోసా ఇచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతోనే రైతులు మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల వైపు చూస్తున్నారని విమర్శించారు. నిర్మల్ జిల్లా ముధోల్కు చెందిన రైతు మంగారపు లక్ష్మణ్ అకాల వర్షాలతో తాను వేసిన పంట పూర్తిగా నీటి పాలు కావడంతో తీవ్రంగా నష్టపోయి, సాగు పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. పంటలు మునిగిపోయి 15 రోజులవు తున్న ఇప్పటి వరకు రైతులకు నష్టపరిహారం ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భట్టి వెల్లడించారు.
ప్రభుత్వం క్షేత్రస్థాయిలోకి అధికారులను పంపించి పంట నష్టాన్ని ఎందుకు అంచనా వేయడం లేదని ప్రశ్నించారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్రానికి నివేదిక ఇవ్వకపోవడం నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను తక్షణమే క్షేత్రస్థాయిలోకి పంపించి పంట నష్టపరిహారం అంచనా వేయించి నివేదికను కేంద్రానికి అందజేయాలనీ, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉందని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, పంట నష్టం బీమా పథకం అమలు చేయకుండా రైతులను ఆగం చేయడం సరికాదని పేర్కొన్నారు. పంటల బీమా పథకాన్ని కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి రైతులను ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టం నుంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.