Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం), వ్యకాసా ఆధ్వర్యంలో ఆందోళన
- రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఉద్రిక్తత :
సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు
నవతెలంగాణ-పరిగి
పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదని సీపీఐ(ఎం) నాయకులు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 6గంటల నుంచి స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు గుడిసెలు వేసి నిరసన తెలిపారు. వీరికి సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య, కేవీపీస్ జిల్లా కార్యదర్శి మహిపాల్ మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో సర్వేనెంబర్ 18లో 9 ఎకరాల 39గుంటలు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని గతంలో కొందరు కబ్జా చేశారు. సీపీఐ(ఎం) నిరంతరం పోరాటాలు చేయడంతో ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. అయితే ఈ భూమిని పేదలకు ఇవ్వాలని ఆదివారం సీపీఐ(ఎం), వ్యకాసా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, రావాలంటూ నినాదాలు చేశారు. దాంతో అధికారులు సీఆర్పీఎఫ్ బలగాలను ఘటనా స్థలానికి రప్పించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పేదలు వేసిన గుడిసెలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఉదయం 11 గంటలకు తహసీల్దార్, డీఎస్పీ వచ్చి ఆ భూమిని ఖాళీ చేయాలని కోరారు. ఇన్ని రోజులు కబ్జాదారులు భూమిని కబ్జా చేస్తే ఏం చేశారని సీపీఐ(ఎం) నాయకులు, ప్రజలు అధికారులను నిలదీశారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించి కూర్చున్నారు. దాంతో పోలీసులు.. సీపీఐ(ఎం) నాయకులను బలవంతంగా లాక్కెళ్లారు. నాయకుల ను అరెస్టు చేయకుండా ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్రమ అరెస్టులు ఆపాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొందరు పోలీసులు మహిళలను సైతం లాగి పడేశారు. అక్కడ ఉన్న వారిని చెదరగొడుతూ సీపీఐ(ఎం) నాయకులను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆగ్రహించిన పేద ప్రజలు అందరూ ఒక్కసారిగా రోడ్డుపైకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.పోలీసులు మహిళలను బలవంతంగా లాక్కెళ్లి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య, బసిరెడ్డి, యాదగిరిలను కొడంగల్ పోలీస్ స్టేషన్కు, కేవీపీస్ జిల్లా కార్యదర్శి మహిపాల్, నరేందర్, కృష్ణ, శేఖర్లను మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం), కేవీపీఎస్ నాయకులు వెంకటయ్య, మహిపాల్ మాట్లాడుతూ.. మహిళలని కూడా చూడకుండా పేదలపై లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. తమను అక్రమంగా అరెస్టు చేసి పేదలు వేసిన గుడిసెలకు నిప్పుపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 నుంచి రూ.20 కోట్ల విలువ చేసే భూమిపై కొంత మంది రాజకీయ నాయకులు, భూ కబ్జాదారుల కన్ను పడిందని తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిడితో పోలీసులు ఇంత అరాచకంగా పేదలపై జూలుం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీపీఐ(ఎం), వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తే ఈ భూమి ప్రభుత్వ భూమిగా తేల్చి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కానీ నేటికీ భూ కబ్జాదారులు ఆధీనంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా 9-39 గుంటల భూమిని పేదలకు పంచాలని, లేదంటే వేలాది మందితో కలెక్టర్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. మహిళపై లాఠీఛార్జి, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్ల స్థలాలు వచ్చే వరకూ సీపీఐ(ఎం) సమరశీల పోరాటం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.